మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరగణం రాళ్ల దాడులు చేసింది. సోమవారం ప్రచార సమయం ముగిసి రాత్రి బాగా పొద్దుపోయాక గ్రామాలకు వచ్చిన బీజేపీ అభ్యర్థి.. ఆయన అనుచర గణం తమ వాహనాల్లో ముందే తెచ్చుకొన్న రాళ్లు, కర్రలతో గ్రామస్థులపైన, కవరేజీకి వచ్చిన పాత్రికేయులపైన విచ్చలవిడిగా దాడి చేశారు.
రెడ్డిబావి గ్రామంలో :
రాజగోపాల్‌రెడ్డి.. చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ పరిధి రెడ్డిబావి (సైదాబాద్)కి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేండ్లు అయినా ఎన్నడూ గ్రామానికి రాలేదని.. ఇప్పుడెందుకొచ్చారని గ్రామస్థులు నిలదీశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామస్థులపై దుర్భాషలాడారు. తన అనుచరులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన బీజేపీ కిరాయి గూండాలు గ్రామస్థులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు మహిళల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహించిన గ్రామస్థులు చెప్పులు చూపిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తంచేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రచారం పూర్తికాకుండానే రాజగోపాల్ వెనక్కి మళ్లారు.
ఆరెగూడెంలో :
కాగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలోనూ రాజగోపాల్‌రెడ్డికి గ్రామస్థుల నుంచి నిలదీతలు, నిరసనలే ఎదురయ్యాయి. ప్రచార సమయం ముగిశాక రాత్రివేళ గ్రామానికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్థులు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఏం చేశారంటూ ప్రశ్నించారు. దీంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కర్రలతో విరుచుకుపడటంతో పలువురికి గాయాలయ్యాయి.
అంకిరెడ్డిగూడెంలో :
అంకిరెడ్డి గూడెంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే సీన్ రిపీట్ చేశారు. సమయం ముగిసిపోయిన తర్వాత ప్రచారానికి వచ్చారు. గ్రామంలోని రచ్చబండ దగ్గర ప్రసంగించడానికి వస్తుండగా పక్కనే ఉన్న టీఆర్‌ఎస్ కార్యాలయం ముందున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. సమయం ముగిశాక ప్రచారం చేయడమేమిటని అక్కడే ఉన్న పోలీసులను ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యాలయంపైకి దూసుకుకొచ్చారు. అడ్డుకోబోయిన టీఆర్‌ఎస్ శ్రేణులపై వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో పాటు భౌతిక దాడులు కూడా జరగటంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.