నగరవాసులకు ఇంకుడుగుంతలు, నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు నిర్మిస్తున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును గురువారం రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి గారు ప్రారంభించారు.
నగరవాసులకు నీటిపొదుపు, ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించేందుకు దాదాపు రూ. 2 కోట్లతో థీమ్ పార్కు ఏర్పాటు చేసారు. ఇందులో భవనాల్లో, కాలువల్లో ఏ విధంగా నీటి పొదుపు చేయవచ్చో తెలియజేసే నిర్మాణాలు ఇందులో ఉంటాయి. 42 నమూనాల నీటి సంరక్షణ విధానాలు ఇందులో ఏర్పాటు చేసారు. పిల్లలకు నీటి విలువలను గురించి తెలియజేసే యానిమేషన్ విడియోలు, కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని తరలిస్తున్న త్రీడి రూపంలో వీడియోలు ఇందులో ప్రదర్శిస్తున్నారు.
ఈ పార్కులో గొడుగు ఆకారంలోని నాలుగు గజెటోలను నిర్మించారు. వాననీరు వీటిపై పడగానే ఆ నీరు ప్రక్కనే ఉన్న సంపులోకి వెళ్లేలా ఏర్పాటుచేశారు. అలాగే విద్యార్థులను ఆకర్షించేందుకు పలు రకాల ఆటలను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన భారీ స్కేలుపై మనిషి నిలబడితే ఆ వ్యక్తి ఒంట్లో ఎంత నీరు ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. వీటితోపాటు 5 నిమిషాల నిడివితో వాననీటి సంరక్షణ చర్యలు సులువుగా అర్థమయ్యేలా చోటాభీమ్ వీడియోలు రూపొందించారు.
ఈ సందర్బంగా సీఎస్ ఎస్.కె. జోషి మాట్లాడుతూ రాబోయే తరాలకు నీటి విలువను తెలిపేందుకు ఈ థీమ్ పార్కు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల తరలింపులో జలమండలి పడే కష్టం త్రీడి వీడియోల్లో కళ్లకు కట్టినట్లు తెలుస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ అర్వింద్ కుమార్, ఐఏఎస్, జలమండలి ఎండీ శ్రీ ఎం. దానకిషోర్, ఐఏఎస్, జలమండలి సెకండరీ ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ డా. పీ.ఎస్. సూర్యనారాయణ, ఆపరేషన్స్-2 డైరెక్టర్ శ్రీ పి. రవి, టెక్నికల్ డైరెక్టర్ శ్రీ ఎమ్.బి. ప్రవీణ్ కుమార్‌లతో పాటు జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.