రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి గడువు ముగియనుండటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ రోజు, రేపు మొత్తం 20 చోట్ల బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ రోజు కేసీఆర్ తాండూరు, వికారాబాద్, పరిగి, మేడ్చల్, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, సంగారెడ్డి, సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గ బహిరంగసభల్లో ప్రసంగిస్తారు.
తాండూరు బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ, తాండూరు కందిపప్పుకు ఫేమస్ అని, కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తాండూరుకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత కరువును మట్టుబెడతానని, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తాండూరు, పరిగి, వికారాబాద్ కు సాగునీరు అందిస్తానని చెప్పారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి మహేందర్ రెడ్డిని, పరిగి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల హరీశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
దేవుడిదయవల్ల ఆంధ్రోళ్ళ పాలన నుండి తెలంగాణ బయటపడిందని, ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని, ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, జాగ్రత్తగా అలోచించి ఓటు వెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆంధ్రా పార్టీలకు ఓటువేసి మోసపోవద్దని, మన తలరాతను మనమే రాసుకుందామని అన్నారు. మానిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలనూ అమలుచేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం పరిగిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
వికారాబాద్ లో జరగనున్న బహిరంగసభకు చేరుకోవాల్సి ఉండగా హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ల్యాండింగ్ కు అంతరాయం కలిగింది. దీంతో బోడుప్పల్ బహిరంగసభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం ఎల్బీ నగర్ బహిరంగసభకు చేరుకొని భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, త్వరలో హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తుందని, దానివల్ల ప్రత్యక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, హైదరాబాద్ దేశంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ లో దారుణమైన మురికివాడలు వున్నాయని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మురికివాడల తలరాతలు మారలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.