రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆసరా పించన్ల పంపిణీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. సుమారు 145 కోట్ల రూపాయలను అధికారులు పది జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు మొదటిరోజు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు గతంలో నెలకు రూ. 200 గా ఉన్న పించన్ ను రూ. 1000, వికలాంగులకు రూ. 1500 గా ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ రెండు నెలల పించన్ ఒకేసారి కలిపి నగదు రూపంలో అధికారులు అందజేశారు.
ఆసరా పథకం కింద పించన్లను అందుకున్న తెలంగాణ పది జిల్లాలకు చెందిన లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. పించన్ ను భారీగా పెంచిన సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ కొన్ని చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆసరా పథకం కింద పించన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిరోజు లక్షా 44 వేల మందికి, కరీంనగర్ జిల్లాలో లక్షమందికి, రంగారెడ్డి జిల్లాలో 15, 487 మందికి పించన్లు పంపిణీ చేశారు.
మెదక్ జిల్లా సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన నిమిత్తం పలువురు ఎమ్మెల్యేలు అక్కడికే వెళ్ళడంతో మొదటిరోజు పించన్ల పంపిణీ నెమ్మదిగా సాగింది. గురువారం నుండి ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాల్లో పించన్లు పంపిణీ చేయనున్నారు. అయితే హైదరాబాద్ జిల్లాలో సరిపోయినంత మంది అధికారులు లేక కొంత ఆలస్యం అవుతున్నదని, ఎంపిక చేసిన వారందరికీ ఈనెల 15 లోపు పెన్షన్లు అందజేస్తామని అధికారులు తెలిపారు.