mt_logo

తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ – జగదీశ్ రెడ్డి

విద్యార్థుల స్థానికతను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తుందని, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు చెల్లించేది లేదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు వాళ్ళ ప్రాంతం విద్యార్థులకు కూడా ఫీజు చెల్లించాలనడం సిగ్గుచేటని, ఒక్క రూపాయి కూడా ఆ ప్రాంత విద్యార్థులకు చెల్లించేది లేదని అన్నారు.

బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడ్మిషన్లు గతంలో ఏవిధంగా జరిగాయో అదే విధంగా జరుగుతాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏపీ కి చెందిన విద్యార్థులకు వర్తించదని పేర్కొన్నారు.

కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులను చేర్పించుకునే సమయంలో ఆలోచించుకోవాలని, చేరబోయే విద్యార్థి ఏ రాష్ట్రానికి చెందినవారో ముందుగానే తెలుసుకుని అడ్మిషన్లు ఇవ్వాలని జగదీశ్ రెడ్డి సూచించారు. కళాశాలల పాత బకాయిలు కూడా ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్రాలే చెల్లించాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంచాలా? తీసివేయాలా? అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *