mt_logo

వరద బాధితులకు అండగా ప్రజాప్రతినిధులు

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడుతున్నారు. మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ వరంగల్ వెళ్ళి వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులకు అండగా నిలబడతామని, నాలాలపై కట్టిన అక్రమ కట్టడాల వల్లే ఈ సమస్య అని, నెలరోజుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని వారికి పూర్తి భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక నేతలు, కార్యకర్తలు స్థానిక ప్రజలకు అండగా నిలుస్తున్నారు.


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ములుగులోని అనేక ప్రాంతాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ములుగులో దాదాపు 150 సెం.మీ. వర్షపాతం కురవడం వల్ల ఇక్కడి ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని, అందుకే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వారికి శాశ్వత పరిష్కారం ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని అన్నారు. 6,400 మందికి పునరావాస కేంద్రాల్లో పెట్టి వసతులు కల్పిస్తున్నామని, ఎవరికీ ప్రాణహాని కలగకుండా కాపాడుకోగలిగామని తెలిపారు.


ఇళ్ళు కోల్పోయినవారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించామని, వర్షాల వల్ల దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులకోసం వెంటనే నిధులను కూడా ఇవ్వాలని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. . సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలని మంత్రులు, కలెక్టర్లు, అధికారులకు సూచనలు చేస్తున్నారన్నారు. రోడ్లు ఎక్కడ దెబ్బ తిన్నాయో వెంటనే నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని, కరోనా విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు.

మరోవైపు భద్రాచలం పట్టణంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బుధవారం పర్యటించారు. భద్రాచలం కరకట్టకు చేరుకున్న ఎంపీ అక్కడి వరద ఉధృతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపుకు గురైన రామాలయం పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడినుండి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వరద బాధితులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *