mt_logo

నల్లా కనెక్షన్లలో తెలంగాణ టాప్!!

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పథకాల వల్ల దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతోంది. వివిధ పథకాలు కేంద్రం కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తుండటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ బాటనే అనుసరిస్తున్నాయన్న విషయం సుస్పష్టం! ఉమ్మడి ఏపీలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య అంతర్జాతీయ సమస్య అయినా ఆనాటి పాలకులు పట్టించుకున్నదే లేదు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యతగా తాగునీటి సమస్యను అధిగమించేలా చర్యలు చేపట్టారు. అదే మిషన్ భగీరథ పథకం.. పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ పథకంపై అధ్యయనం చేసి వెళ్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో 98.31% ఇండ్లకు నీటిసరఫరా ఇచ్చి ముందంజలో ఉంది. వేరే ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేకపోవడం విశేషం!! ఈ విషయాన్ని బుధవారం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ వెల్లడించిన గణాంకాలు తెలిపాయి. నల్లా కనెక్షన్లలో దేశ సగటు 27.28 శాతం ఉండగా 2.05 శాతంతో వెస్ట్ బెంగాల్ చివరి స్థానంలో ఉంది.

రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలు ఉండగా 53.46 లక్షల ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గణాంకాలు చూస్తే మొత్తం 1,897.93 లక్షల ఆవాసాలు ఉండగా 517.97 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నది. ఇది కేవలం 27.28% మాత్రమే. గోవా, పుదుచ్చేరి, హర్యానా రాష్ట్రాలు తర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ 74.16% ఆవాసాలకు మాత్రమే తాగునీరు అందిస్తూ ఐదవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కేవలం 34.71% ఆవాసాలకే నల్లాల ద్వారా తాగునీరు అందిస్తూ అట్టడుగు స్థానంలో ఉంది. ఏపీలో మొత్తం 95.66 లక్షల ఆవాసాలు ఉండగా, కేవలం 33.21 లక్షల ఇండ్లకే నల్లా నీరు అందుతున్నది. కర్ణాటక 28.94%, మహారాష్ట్ర 42.90%, ఛత్తీస్ గఢ్ 11.93% ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *