బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ వర్గీకణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ధర్మోజీగూడ వద్ద జాతీయరహదారిపై ధర్నా చేపట్టారు. టైర్లు కాల్చివేసి రోడ్డుపై బైటాయించారు. మోదీ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ నాయకులు కరీంనగర్‌లో ధర్నాకు దిగారు. కరీంనగర్‌లోని కమాన్ చౌక్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక నేరగాళ్ల వేషంలో ఉన్న కొందరు బై బై మోదీ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తాము బ్యాంకును మాత్రమే దోచుకుంటామని, మీరు మొత్తం దేశాన్నే దోచుకుంటున్నారని పేర్కొంటూ నిరసన వ్యక్తంచేశారు. నగర వ్యాప్తంగా పలుచోట్ల ప్రధానిని ఉద్దేశిస్తూ వ్యంగ హోర్డింగులు వెలిసాయి.

