mt_logo

ఈ నెల 22 నుండి వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

వానకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలాగే పంట కోతలను బట్టి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 2022-23 సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సీజన్‌లో 1.51 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. గ్రేడ్‌-ఎ రకానికి క్వింటాల్‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040గా మద్దతు ధర ఖరారు చేసింది.

వానకాలం ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, మిషన్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. కొనుగోలు కేంద్రాల్లో సమస్యల ఎదురైతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333 లేదా 1967కు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని రైతులను కోరింది.

పీడీఎస్‌లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌కు అనుకూలమైన బ్లెండింగ్‌ మిషన్లు ఉన్న మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. ఒకవేళ బ్లెండింగ్‌ మిషన్ల ఏర్పాటుకు ఎవరైనా హామీ ఇస్తే… వారికి కూడా కేటాయించనున్నది. సివిల్‌ సైప్లెకి ఫోర్టిఫైడ్‌ రా రైస్‌, ఎఫ్‌సీఐకి ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ లేదా రా రైస్‌ రూపంలో సీఎమ్మార్‌ ఇవ్వాలని ఆదేశించింది. సీఎంఆర్‌ ఆలస్యమయ్యే మిల్లర్లపై చర్యలు తీసుకొని ఆ ధాన్యాన్ని వేరే మిల్లులకు అప్పగించాలని కలెక్టర్లకు  సూచించింది. అదేవిధంగా పీడీఎస్‌ బియ్యాన్ని సీఎమ్మార్‌ కింద అందించే మిల్లులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *