ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్ర మంత్రి వర్గాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని, రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోయాయని, ఏ పార్టీ కూడా మెజారిటీ నిరూపించుకొనే పరిస్థితి కనపడటం లేదని వివరిస్తూ కేంద్రానికి గవర్నర్ ఒక నివేదికను సమర్పించారు. ముఖ్యమంత్రి పదవికి అర్హుడైన వ్యక్తి కూడా ఎవరూ కనపడటం లేదని అందులో వివరించారు. బిల్లును రెండు రోజుల్లో రాష్ట్రపతికి పంపించడం, తద్వారా రాష్ట్రపతి సంతకంతో ఆమోద ప్రక్రియ పూర్తికానుంది. ఈ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకోవాలా? అనే అంశాలపై యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేయాలని, వెంటనే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిసి చర్చించినట్లు సమాచారం. వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలియపరుస్తానని, గవర్నర్ నివేదిక, రాజ్యాంగపరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని సోనియా సరైన నిర్ణయం తీసుకుంటారని దిగ్విజయ్ వారితో అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విభజన జరిగిన నేపథ్యంలో ఒక ప్రాంత వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే వేరే ప్రాంతం వారు ఒప్పుకోరని, అందువల్ల రాష్ట్రపతి పాలన తప్పదని కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.