శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలం సీతారాముల దేవస్థానంతో పాటు, ములుగులోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. భద్రాచలంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొని, ఆసియా గిరిజన కుంభమేళా అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతం అని కొనియాడారు. అనంతరం వర్చువల్ విధానంలో ఆసిఫాబాద్, మహబూబాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… తాను మొదటిసారి తెలంగాణలో పర్యటిస్తున్నానని, ఇక్కడి దేవాలయాల్లోని శిల్ప సంపద అమోఘం అన్నారు. తెలంగాణ వనవాసి పరిషత్ గిరిజన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడటం మంచి విషయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ఆలయాల అభివృద్ధికి తోడ్పతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ద్వారా గిరిజన విద్యార్థుల విద్యకోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో దాశరతి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ పంక్తుల్ని చదివి… తెలంగాణ సాహిత్యం తనకెంతో ఇష్టం అన్నారు.
రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్ లో రూ. 25 కోట్లతో సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్ నిర్మించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిందని తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్నారని వివరించారు. రాష్ట్రపతి కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గవర్నర్ తమిళిసై, ఎంపీ మాలోత్ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.