Mission Telangana

ప్రజాకవికి సముచిత నివాళి

ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడి జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి, అతడి ఆశయాలను ప్రచారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షించదగినవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం మన కవులు, కళాకారులకు సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తున్నది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అంటూ తెలంగాణ భావనను తన నాలుకపై నర్తింప చేసిన దాశరథి మహాకవిని ఇటీవలే తగిన రీతిలో స్మరించుకున్నాం.

ఇప్పుడు కాళోజీ ఘనతకు తగినట్టుగా ఉత్సవాల నిర్వహణ సాగింది. ఇందుకు ప్రభుత్వం, సాహితీ సంస్థలు చేసిన కృషి అభినందనీయం. సీమాంధ్ర పాలకులు కాళోజీ ఫౌండేషన్‌కు ఐదువందల గజాల జాగ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాళోజీ కళా కేంద్రానికి, ఫౌండేషన్‌కు మూడున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండ పన్నెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కాళోజీ తెలంగాణ ముద్దు బిడ్డ అయినప్పటికీ, ఆయనను మన ప్రాంతానికే పరిమితం చేయకూడదు. ఆయన రచనలను విశ్వ మానవాళిని సుసంపన్నం చేయడానికి వీలుగా ఇతర భాషల్లోకి అనువదింప చేయాలనుకోవడం కూడా మంచి ఆలోచన.

కాళోజీ తపాలా బిళ్ళ విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతుందని ముఖ్యమంత్రి కేసీయార్ చెప్పడం తెలంగాణవారికి ఆనందం కలిగిస్తున్నది. తెలంగాణ పట్ల సాగిన వివక్షకు తపాలా బిళ్ళలు కూడా మచ్చుతునకలు. ఈ విషయంలో తెలంగాణకు నిజాం కాలంలో దక్కినంత గౌరవం సీమాంధ్ర పాలనలో లభించ లేదు. నిజాం కాలంలో తపాలా బిళ్ళపై తెలుగు భాషకు స్థానం లభించింది. గోల్కొండ కోట, కాకతీయ తోరణం ఆనాటి తపాలా బిళ్ళలపై వెలిగాయి. కానీ సీమాంధ్ర పాలన సాగుతున్నప్పుడు- తపాలా శాఖ ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఇరవై తపాలా బిళ్ళలను విడుదల చేసింది.

ఇందులో ఒక్కటంటే ఒక్కటి- బూర్గుల రామకృష్ణారావుది మాత్రమే- తెలంగాణకు సంబంధించినది. అది కూడా తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైన తరువాత 2001లో బూర్గుల సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్నారని ప్రచారం సాగిస్తూ ఆ సందేశం ఇవ్వాలనే కుట్రలో భాగంగా ఆయన తపాలా బిళ్ల విడుదలైందనవచ్చు. నిజానికి తపాలాబిళ్ళ విడుదల చేయడానికి కావలసిన అర్హత బూర్గులకు ఉన్నది. అయి నా మలి దశ ఉద్యమం ప్రారంభమయ్యే వరకు సీమాంధ్ర పాలకులు ఆయనకు ఏనాడూ తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు. మిగతా పంతొమ్మిది తపాలా బిళ్ళలు సీమాంధ్రవారివే. సీమాంధ్ర పాలకులు తమ ప్రాంతానికి చెందిన వివిధ రంగాలకు చెందిన భిన్న సామాజిక వర్గాల వారి పేర తపాలా బిళ్ళలు విడుదల చేయించుకున్నారు.

కృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి 500ఏండ్లు అయిన సందర్భంగా 2011లో తపాలా బిళ్ళ విడుదల చేయించుకున్నారు. కానీ భారత చరిత్రలో గొప్ప సామ్రాజ్ఞిగా, ప్రపంచ చరిత్రలోని గొప్ప యోధురాళ్ళలో ఒకరిగా ప్రసిద్ధికెక్కిన రుద్రమదేవి పట్టాభిషిక్తురాలై 750 ఏండ్లయిన సందర్భంగా 2013లో తపాలా బిళ్ళ విడుదల చేయించాలని తెలంగాణవాదులు ఎంత కోరినా ఫలితం లేకపోయింది. తపాలా బిళ్ళ విడుదల చేసేది తపాలా శాఖ అయినప్పటికీ, ఇక్కడి రాష్ట్ర పాలకుల పాత్ర కూడా ప్రధానమైనది. కాళోజీ పేర తపాలా బిళ్ళ విడుదల చేయించడానికి యత్నిస్తామని కేసీయార్ చెప్పడం ద్వారా ఇంతకాలం తమకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన చెందుతున్న తెలంగాణ సమాజాన్ని ఊరడించినట్టయింది.

కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవాలనే నిర్ణయం ఈ నాటి సందర్భాన్ని సూచిస్తున్నది. కాళోజీ తెలంగాణ భాష తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. తెలుగు వ్యవహారికంగా చెప్పుకుంటున్నది ఒకటిన్నర జిల్లాల రెండున్నర కులాల భాష అని ముసుగు తీసి చూపడం ఆయనకే సాధ్యమైంది. ఉర్దూ మాట సడక్ అంటారేమిటి? రోడ్డు అనాలి అంటూ మనకు భాష నేర్ప చూసిన సీమాంధ్ర మధ్యతరగతి డొల్లతనాన్ని వ్యంగ్యంగా ఎండగట్టడం ఆయన గొప్పతనం. అయినా ఆనాడు తెలంగాణ భాష మాట్లాడితే సీమాంధ్ర శిష్టవర్గం అవమానించేది. ఆరణాల కూలి నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎదిగిన నిరాడంబర నాయకుడు, తెలంగాణ బిడ్డ అంజయ్య మన భాషలో మాట్లాడినందుకు అవమానాల పాలయ్యాడు.

అంజయ్యదే నిజమైన తెలుగు భాష అని సమర్థించినందుకు మన దాశరథిని కూడా అవహేళన చేసిన కుసంస్కారం సీమాంధ్ర మీడియాది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో మన సంస్కృతికి, మన భాషకు తగిన ప్రాధాన్యం లభించాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ కోరిక ఫలించడానికి చేయవలసిన కృషి ఎంతో ఉన్నది. ఇప్పటికీ పూర్తిగా మన భాషలో మాట్లాడుకోలేక పోతున్నాం. మన భాషను రాయలేక పోతున్నాం. మన సాంస్కృతిక వ్యక్తీకరణకు ఇంకా జంకుతున్న వారూ ఉన్నారు. ఈ సీమాంధ్ర అవశేషాలను వదిలించుకోవడమే మనం కాళోజీకి ఇచ్చే నిజమైన నివాళి. ఇందుకు సాహితీలోకం, కళాకారులు, సాంస్కృతిక ఉద్యమకారులు చేయవలసిన కృషి ఎంతో ఉన్నది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననేపథ్యంలో మన సంస్కృతికి, మన భాషకు తగిన ప్రాధాన్యం లభించాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ కోరిక ఫలించడానికి చేయవలసిన కృషి ఎంతో ఉన్నది. ఇప్పటికీ పూర్తిగా మన భాషలో మాట్లాడుకోలేక పోతున్నాం. మన భాషను రాయలేక పోతున్నాం. మన సాంస్కృతిక వ్యక్తీకరణకు ఇంకా జంకుతున్న వారూ ఉన్నారు. ఈ సీమాంధ్ర అవశేషాలనువదిలించుకోవడమే మనం కాళోజీకి ఇచ్చే నిజమైన నివాళి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *