mt_logo

ప్రతి ఒక్క ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా – కేసీఆర్

వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బుధవారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల రాష్ట్రస్థాయి ఇంజినీర్ల అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని అందించేందుకు విద్యుత్ గ్రిడ్ తరహాలో తెలంగాణ స్టేట్ ద్రింకింగ్ వాటర్ గ్రిడ్(టీఎస్ డీడబ్ల్యూజీ) ని 20 నుండి 25 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఈ పథకం తనకు కొత్త కాదని, 20 ఏండ్ల కిందట తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సిద్దిపేట నియోజకవర్గానికి 65 కిలోమీటర్ల దూరం నుండి పైపులైను ద్వారా మంచినీటి సరఫరా పథకాన్ని విజయవంతంగా అమలు చేశానని గుర్తుచేశారు. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వయర్లను అనుసంధానం చేస్తూ మూడున్నరేండ్లలో అమలులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో ఉన్న నీటివనరులు, పైప్ లైన్ల పనులు చేపట్టేందుకు పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేస్తామని, ఎంత ఖర్చు చేసైనా ఈ పథకం విజయవంతం చేయాలని సీఎం అధికారులను కోరారు.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి తమ వంతు సాయంగా ఒకరోజు వేతనాన్ని అందించాలని తెలంగాణ గ్రామీణ తాగునీటి సరఫరా ఉద్యోగులు ముందుకొచ్చారు. తెలంగాణ రూరల్ వాటర్ సప్లై ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. కరీంనగర్ కు చెందిన ఆర్ డబ్ల్యూ ఎస్ జియాలజిస్ట్ కరణం ప్రసన్న తనకు సకలజనుల సమ్మె కాలంలో ప్రభుత్వం చెల్లించిన 42 రోజుల వేతనాన్ని తెలంగాణ గ్రిడ్ ఏర్పాటుకు విరాళంగా అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, గ్రామీణ నీటిసరఫరా శాఖ చీఫ్ ఇంజినీర్ నరేందర్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ ఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *