పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎన్నికలను బహిష్కరించే దిశగా కదులుతున్నారు. ప్రధానంగా కుక్కునూరు మండలంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిచడంతో పాటు మరో ఆరు మండలాల్లోనూ నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. ముంపుప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని, చచ్చినా, బతికినా తెలంగాణలోనే ఉంటామని అన్ని పార్టీల నేతలూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కునూరు మండలంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు, దిష్టిబొమ్మల దహనం, ఆమరణ దీక్షలు చేస్తూ తాజాగా స్థానిక ఎన్నికలైన జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలను అన్ని పార్టీల వారూ బహిష్కరించారు. గురువారంతో గడువు కూడా ముగిసిపోవడంతో అక్కడ ఇక ఎన్నికలు లేనట్లే అని తెలుస్తుంది. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఉన్న ఏడు మండలాలలో ముంపు ప్రాంత రక్షణ కమిటీ నిరసనలు తెలుపుతూనే ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక్క నేతకూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాకపోవడం చూసి భద్రాచలం, బూర్గంపహాడ్, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వీఆర్ పురం లలో కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అక్కడి నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముంపు మండలాలను సీమాంధ్రలో కలపొద్దని, డిజైన్ మారిస్తేనే ప్రాజెక్టు కట్టనిస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పడం వల్ల బాధితుల్లో పూర్తి భరోసా నింపగలిగారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి నేతలు, ప్రజలు తేల్చి చెపుతున్నారు.