mt_logo

టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన మార్చి 22న?

వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనలో టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉంది. గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు కడియం శ్రీహరి, వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డి, రమణాచారి, ఏకే గోయల్, రామ్ లక్ష్మణ్ తదితరులు సమావేశమై మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఆవిర్భావం నుండి ఇచ్చిన హామీలు, సభల్లో ప్రకటించిన అన్ని అంశాలను మేనిఫెస్టోలో చేర్చనున్నారు. శుక్రవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేనిఫెస్టో శనివారం విడుదల చేయాలని అనుకుంటున్నట్లు, రెండు రోజుల క్రితం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రవాణా పన్ను మినహాయింపు అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆటో డ్రైవర్లకు కేసీఆర్ ఇచ్చిన వరాల జల్లుపై తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ అధ్యక్షుడు మహ్మద్ అమానుల్లాఖాన్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ నెల 25న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కేసీఆర్ ను సన్మానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గడిచిన 57ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పోరాటాలు చేసినా సమస్యలు పరిష్కరించడంలో అన్ని ప్రభుత్వాలూ దారుణంగా విఫలమయ్యాయని, కేసీఆర్ మాత్రమే సరైన స్పందన తెలియజేశారని ప్రశంసిస్తూ 25 న జరిగే సన్మాన కార్యక్రమానికి ఆటో డ్రైవర్లందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *