పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం లోక్ సభలో ప్రవేశబెట్టగానే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. గత నెలలో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే పోలవరంపై ఆర్డినెన్స్ ను జారీ చేస్తూ పార్లమెంటు ఆమోదం కోసం తెచ్చారు. ఈ బిల్లు ఒకవేళ ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలు, కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుకూలత లభించింది.
బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టగానే టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లోకి దూసుకుపోయి పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారికి తెలంగాణకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బీ వినోద్ సభలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 మార్చి 1వ తేదీనుండి అమల్లోకి వచ్చినట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొన్నదని, ఈ చట్టం అమలులోకి రావడంతోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయని, దానికి సంబంధించి గెజిట్ కూడా వెలువడిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులను కేంద్రం మార్చి 1వ తేదీనే నిర్ణయించిందని, ఆ తేదీ తర్వాత సరిహద్దులు మార్చాలనుకుంటే విధిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ – 3ను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ బిల్లు చట్టవిరుద్ధమైనదే కాక అక్కడ నివసిస్తున్న గిరిజనుల జీవితాలు ప్రశ్నార్ధకమవుతాయని, గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘించినట్లు అవుతుందని ఎంపీ సీతారాం నాయక్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, ఆర్టికల్ – 3 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ప్రపంచం మొత్తం తెలుసని, ఇప్పుడు గెజిట్ ప్రచురితమైన తర్వాత రాష్ట్రాల సరిహద్దులను ఆర్డినెన్స్ మార్చాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు.