mt_logo

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి!

మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఈసారీ అన్యాయమే జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం లానే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, బడ్జెట్ లో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావనే రాలేదని సీఎం పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని, ఎంఎంటీఎస్ రెండవ దశ పనులకు 20కోట్ల రూపాయలు ఏమూలకు సరిపోతాయని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన ప్రాజెక్టులను అసలు పట్టించుకోకపోగా, గతంలో మంజూరైన ప్రాజెక్టులకు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకోసం 20, 698 కోట్ల రూపాయలు కేటాయించామని, వాటితో 29 ప్రాజెక్టులు చేపడతామని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు.

తెలంగాణకు కేవలం రెండు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్ళను మాత్రమే ప్రకటించింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఇచ్చినా అవి ఏమాత్రం సరిపోవు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేట వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్ రైల్వే డివిజన్, పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్లు, ఫలక్ నుమా- శంషాబాద్ లోకల్ రైలు, స్టేషన్ల ఆధునీకరణ, మౌలాలి, నాగులపల్లి టెర్మినల్స్ పై స్పష్టత ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *