mt_logo

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి:

పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ దేశం ప్రత్యక్షంగా చూసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా. కానీ అది చారిత్రాత్మకం అయినప్పుడు వ్యాఖ్యానం అవసరం అవుతుంది. విశ్లేషణ ప్రధానమవుతుంది. వివరణ పనికొస్తుంది. ఎప్పుడైనా సరే వర్తమాన సామాజిక సందర్భం గుర్తు పెట్టుకోదగినది అయినప్పుడు అది చరిత్రగా నమోదవుతుంది. తెలంగాణ జైత్రయాత్ర చరిత్రలో నిలిచిపోయే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ఇది ప్రజాస్వామ్య పోరాట విజయం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజా ఉద్యమాలు గెలిచి ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటి అరుదైన విజయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటి. అందుకే ఇది విశ్లేషించదగిన విషయం. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, సాధించిన విజయం అపూర్వమైనది.

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, పౌరసమాజం మొత్తంగా యావత్ తెలంగాణ సకల జనులు భాగస్వాములై కదిలారు. నిలబడి పోరాడారు. చివరకు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం దాదాపు యాభై సంవత్సరాలు అంచెలంచెలుగా ఒక సుదీర్ఘ ప్రస్థానంగా సాగింది. ముఖ్యంగా చివరి దశలో ఒక బలమైన పౌరసమాజ వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ప్రజాఉద్యమాన్ని మూడు సంవత్సరాల పాటు నిలబెట్టి ఒక జైత్రయాత్రగా మలిచింది. ఈ పోరాట కాలంలోనే తెలంగాణ కరదీపికగా నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమయ్యింది. ఆ పత్రికలో ఘంటాపథంగా వచ్చిన ఉద్యమ వ్యాఖ్యానమే ఈ సంకలనం. నమస్తే తెలంగాణ పత్రిక 2011లో జూన్ 6న ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే దాకా వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఇందులో పొందుపరచడం జరిగింది.

ఘంటాపథం పూర్తిగా ఒక రాజకీయ కాలం. తెలంగాణవాద కోణంలో రాజకీయాలను విశ్లేషించిన కాలం. అలాగని అన్నీ కేవలం తెలంగాణ వ్యాసాలే లేవు. తెలంగాణ ఉద్యమం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఉద్యమానికి, తెలంగాణకు పనికొచ్చే ఇతర సమాజాల అనుభవాలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. అయితే చాలావరకు ఉద్యమం మీద, రాజకీయ పరిణామాల మీద తక్షణ వ్యాఖ్యలుగానే ఉంటాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఘంటాపథంగా వచ్చిన వ్యాసాలను ఒకచోట ఉంచడం ద్వారా ఉద్యమ క్రమాన్ని సంకలన పరిచినట్టుగా ఉంటుందని భవిషత్తులో తెలంగాణ ఉద్యమానికి ఆ క్రమంలో మారుతూ వచ్చిన రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక క్రానికల్‌గా పనికి వస్తుందన్న ఉద్దేశ్యంతో మలుపు మిత్రులు దీనిని పుస్తకంగా ప్రచురించడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో ఇటీవలే అడుగుపెట్టిన మలుపు దేశ సామాజిక రాజకీయ చర్చను కొత్త మలుపు తిప్పిన అనేక ప్రతిష్టాత్మక ప్రచురణలను తీసుకువచ్చింది. అటువంటి సంస్థ తెలంగాణ జైత్రయాత్ర ప్రచురించడం ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు కారకులైన మిత్రులు కందాడి బాల్‌రెడ్డి, కొణతం దిలీప్‌లకు కృతజ్ఞతలు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో ఏ తెలంగాణ ఉద్యమసంస్థలో భాగస్వామిని కాకపోయినా లక్షలాదిమందికి నా మాట వినిపించడానికి తెలుగు మీడియా ఒక వాహిక అయింది.

వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఉద్యమశక్తులతో నిరంతరం సంభాషించే అవకాశం నాకు మీడియా కల్పించింది. ఇది నా అవగాహనకు, రచనా వ్యాసాంగానికి ఎంతగానో ఉపకరించింది. అలాగే నా ఆలోచనలు జనబాహుళ్యానికి చేరే అవకాశం టెలివిజన్ చర్చల ద్వారా కలిగింది. ఘంటాపథంగా సాగిన నా ఆలోచనలకు నమస్తే తెలంగాణ ఒక సరికొత్త వేదికయ్యింది, ఆ పత్రిక ప్రారంభానికి చాలారోజులు ముందే ఆ పత్రిక వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)గారు నన్ను ఒక కాలం రాయవలసిందిగా కోరారు. టీ న్యూస్‌లో ఒక లైవ్ షోలో నాతో మాట్లాడిన ఆయన మన పత్రికలో వారం వారం మీ విశ్లేషణ ఉండాలి అన్నారు. పత్రిక ప్రారంభ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. శుభాకాంక్షలు చెప్పడానికి సంపాదకులు అల్లం నారాయణ గారికి ఫోన్ చేశాను. అక్కడే ఉన్న కేసీఆర్ గారు ఫోన్ తీసుకుని ఎప్పుడొస్తున్నారు? మీ కాలం వెంటనే మొదలుపెట్టండి అని పురమాయించారు. నిజానికి ఒక రకంగా ఆయన పట్టుబట్టి ఘంటాపథం రాయించారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలా మొదలయిన ఈ కాలాన్ని కొనసాగించిన వ్యక్తి అల్లం నారాయణ గారు.

అల్లం నారాయణ జర్నలిజంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా నాకు మార్గదర్శి. మా అనుబంధం మూడుదశాబ్దాల క్రితం కరీంనగర్‌లో జీవగడ్డ పత్రికతో మొదలయ్యింది. అప్పటినుంచి నేను ఏం రాస్తానో, ఎలా రాస్తానో నారాయణ గారికి తెలుసు, ఆ నమ్మకంతోనే నేను ఏది రాసినా అభ్యంతరం పెట్టకుండా అచ్చువేశారు. అప్పుడప్పుడు వీలు కుదరక రాయకపోయినా కాలం మాత్రం కొనసాగనిచ్చారు. అందుకు అల్లంకు హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ కాలం కొనసాగడానికి కారణమైన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి, ముఖ్యంగా ఆ పత్రిక సీఎండీ సీఎల్ రాజం గారికి, సీఈవో, నాకు ఆత్మీయమిత్రులు కట్టా శేఖర్‌రెడ్డి, అలాగే సంపాదకవర్గంలోని మిత్రులు వేణుగోపాలస్వామి, ఆసరి రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఘంటాపథం మాత్రమే కాదు ఈ పుస్తక ప్రచురణలో రాజు సహకారం మరువలేనిది. అలాగే మిత్రుడు, జర్నలిస్టు రఘురాములు, మంచి పుస్తకం సురేష్‌లకు నా ధన్యవాదాలు.

ఈ కాలంలోనే కాదు, చాలా కాలం నుంచి నా రచనలను చదివి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చే అంత్యంత ఆత్మీయ మిత్రులు కె. శ్రీనివాస్. నేను ఏ రంగం ఎంచుకున్నా వెన్నుతట్టి ప్రోత్సహించే వాత్సల్యం శ్రీనివాస్‌ది. ఆయన నన్ను కొత్తగా పరిచయం చేశారు. శ్రీనివాస్‌కు నా కృతజ్ఞతలు. అలాగే నాకు ఆప్తుడు రైతునేస్తం వెంకటేశ్వర్‌రావు, ఈ పుస్తకాన్ని ముందుగా ఆయనే ప్రచురించాలనుకున్నారు. కంపోజ్ కూడా చేసి ఉంచారు. కానీ మలుపు మిత్రుల కోరిక మేరకు వారికి ఇచ్చేశారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను అభిమానించే ఇద్దరు పెద్దలు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు.

ఆ ఇద్దరూ ఘంటాపథం చదివి అప్పుడప్పుడు అభిప్రాయాలు, అభినందనలు చెపుతూ ఉండేవారు. వారిలో ఒకరు విప్లవకవి వరవరరావు అయితే మరొకరు న్యాయకోవిదులు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గారు. అడిగిన వెంటనే నాలుగు మాటలు రాసిచ్చిన వారిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఘంటాపథం పాఠకుల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఒకరు. వారు క్రమం తప్పకుండా చదివి తమ అభిప్రాయాలు పంచుకునేవారు. ఇవి నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. వారితో పాటు అనేకమంది ఉద్యమకారులు, ఫేస్‌బుక్‌లోనో, నా బ్లాగ్‌లోనో వారం వారం కాలం చదివి అభిప్రాయాలు పంచుకున్న మిత్రులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్తే తెలంగాణ పాఠకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
(నేడు ఆవిష్కరణ జరుగుతున్న తెలంగాణ జైత్రయాత్ర
పుస్తకంలోని రచయిత ముందుమాట.)
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *