mt_logo

నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది.. మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్

పురోగమనం దిశగా పయనిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. 2016 నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. నల్లధనాన్ని వెలికితీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చూడటం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందని వివరించారు. మంగళవారంతో నోట్ల రద్దు అనే విఫల నిర్ణయానికి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా నోట్ల రద్దు దుష్ఫలితాలను కేటీఆర్‌ గుర్తు చేశారు. వాటికి బాధ్యత వహించని ప్రధానిపై మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన ఘోర వైఫల్యమని, ప్రధాని చెప్పిన ఒక లక్ష్యం కూడా నెరవేరని ఆర్థిక వైపరీత్యం అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో సుమారు రూ.30.88 లక్షల కోట్ల నగదు ప్రజల వద్ద ఉండటంతో నోట్ల రద్దుపై నాడు బీజేపీ చెప్పినవన్నీ అసత్యాలేనని తేలిపోయిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత.. 2017 జనవరి నాటికి రూ.17.97 లక్షల కోట్లు చలామణిలో ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం అది 72% పెరిగి రికార్డు స్థాయిలో 30.88 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. నోట్ల రద్దు తరువాత అదనంగా రూ.12.91 లక్షల కోట్ల నగదు కొత్తగా చలామణిలోకి వచ్చిందని తెలిపారు. 2016 నుంచి ప్రతి ఏటా ఆర్థిక వ్యవస్థలో తమ లావాదేవీల కోసం నగదు వినియోగిస్తున్న ప్రజల శాతం క్రమంగా పెరుగుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై ఆంక్షలు పెట్టినప్పటికీ కేంద్రం ఊదరగొట్టిన తక్కువ నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనే లక్ష్యం నెరవేరలేదని విశ్లేషించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో పూర్తిగా విఫలమైనప్పటికీ, నోట్ల రద్దు విజయం సాధించినట్టుగా గొప్పలు చెప్పుకోవడం బీజేపీ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.

రద్దయిన పెద్దనోట్లలో 99.3% తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని అర్బీఐ గణాంకాలతో సహా ప్రకటించిందని గుర్తుచేశారు. రద్దయిన పెద్ద నోట్ల విలువ రూ.15.41 లక్షల కోట్లు కాగా.. తిరిగి డిపాజిటైన వాటి విలువ రూ.15.31 లక్షల కోట్లు అని ఆర్బీఐ వెల్లడించిందని పేర్కొన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రం ప్రయోగించామని ప్రకటించుకున్న కేంద్రం.. చివరికి తెల్లముఖం వేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐ రూ.21 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత చేసీ కేంద్రం సాధించింది శూన్యమని పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవని, ఈ-కామర్స్‌ లావాదేవీల్లో సైతం 50% పైగా క్యాష్‌ అండ్‌ డెలివరీ పద్ధతిని వినియోగిస్తున్నారని వివరించారు.

అనాలోచిత, అర్థరహిత నిర్ణయాల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కొనసాగుతున్నదన్న విషయాన్ని కేంద్రం గ్రహిస్తే మంచిదని కేటీఆర్‌ హితవు చెప్పారు. నోట్ల రద్దు, కరోనా, లాక్‌డౌన్‌ వంటి వాటిని ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణాలుగా చూపిస్తున్నప్పటికీ, లాక్‌డౌన్‌ కన్నా ముందే 2020 నాటికి వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని కేంద్రం దాచిపెడుతున్నదని మండిపడ్డారు. కేవలం ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్లనే దేశంలోని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

నోట్ల రద్దు, కరోనా వల్ల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు. దీంతో నిరుద్యోగం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. 2016-19 మధ్య కాలంలో సుమారు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 2016లో 88 లక్షల మంది కనీసం ఐటీ రిటర్న్‌లు సైతం దాఖలు చేయలేకపోయారని తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాలకు పన్ను రాబడి సైతం అత్యధికంగా పడిపోయిందని, దీంతో ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు.

50 రోజుల సమయం ఇవ్వాలని, నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే, సజీవంగా దహనం చేయాలని నాడు ప్రధాని మోదీ ప్రజలను మాటలతో మభ్యపెట్టారని కేటీఆర్‌ గుర్తుచేశారు. సజీవ దహనం మాట పకన ఉంచి కనీసం నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యత తీసుకునేందుకు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. అనేక ప్రభుత్వరంగ సంస్థలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను అడ్డంగా కూలదోసి, దేశ ప్రజల జీవితాలను తారుమారు చేసిన నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని ఒప్పుకొని.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేకమైన అడ్డదిడ్డమైన, అర్థరహితమైన నిర్ణయాలు తీసుకుంటూ రికార్డు స్థాయి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అనేక దుష్పరిణామాలతో మరింత తిరోగమనానికి దారి తీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన ప్రచార పటాటోపాలను పకనబెట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సానుకూల నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి సారించాలని హితవు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *