—
ఇనుపకండరాలు… ఉక్కునరాలు… నల్లకోట్లు… స్టెతస్కోపులు ఏకశిలను మండించాయి. తెలంగాణ మాగాణంలో సెలయేరులై పారాయి…మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష ప్రజాయుద్ధమై ప్రజ్వరిల్లబోతున్న సంకేతాలిచ్చింది. తెలంగాణపై కపట నాటకాలు ఇంకా ఎంతోకాలం సాగవని ఓరుగల్లు అల్టిమేటమ్ జారీ చేసింది. తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్న సీమాంధ్ర కుట్రలపై కత్తులు దూస్తామని హెచ్చరించింది. బేతాలమాంత్రికుడు కేవీపీ, దగాకోరు లగడపాటి నోట్లకట్టలతో, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న ఆజాదులపై అగ్గిపిడుగులమై లేస్తామని శపథం చేశాయి. ఓరుగల్లు ధిక్కార వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భూమి పుత్రులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవాలను రంగరించి రగల్‌జెండాలమై ఎలుగెత్తి మరోసారి చాటుతామని ఏకశిల ప్రతినబూనింది.
యువతరం శివమెత్తితే లోకమే మారిపోతుంది. మీ కుట్రలు, కుతంత్రాలు తేలిపోతాయి జాగ్రత్త అంటూ ఓరుగల్లు హెచ్చరించింది. ఉడుకు నెత్తురును ఉగ్గుపాలుగా తాగిన వాళ్లం. రగల్‌జెండాపట్టి రణం చేసిన వాళ్లమంటూ నడుస్తున్న ఉద్యమ చరిత్రకు పొడుస్తున్న పొద్దులమై సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తామంటూ వరంగల్ నిప్పుకణికై మండింది. వారానికి ఎన్ని రోజులో, నెలకు ఎన్ని వారాలో మాకు తెలుసంటూ ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న తెలంగాణ వ్యతిరేక శక్తులకు సమాధి కడతామని ఓరుగల్లు సాక్షిగా ఉద్యమసారధులు శపథం చేశారు. ఒక్కరోజు నాలుగు సభలు ఒక్కో వక్త ఒక్కో శతఘ్ని అయి శత్రువుల పాలిటి సింహస్వప్నమై నిలిచారు. ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల మైదానం, ఏకశిల పార్కు ఏకకాలంలో రెండు విద్యార్థి సభలతో సమరనినాదం మార్మోగింది. జిల్లా కోర్టుల సముదాయం ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదుల సభ బడబానలం లేపింది.
కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వైద్యులు అగ్గిని రగిలించారు. తెలంగాణ ఉద్యమానికి దశ దిశా నిర్దేశం చేస్తున్న ఉద్యమ సారథులు ఈ సభల్లో భవిష్యత్ ఉద్యమ నిర్మాణంపై భరోసా కల్పిస్తూ జరుగుతున్న కుట్రలు, కుతంవూతాలపై ఏకబిగిన తూర్పార పట్టా రు. తెలంగాణపై కేంద్రం తనకు తాను విధించుకున్న డెడ్‌లైన్ పై కేంద్రంలో బాధ్యతాయుతమైన మం త్రిగానే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆజాద్ సీమాంధ్రుల తొత్తు అని నాలుగు సభల్లో నలుదిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ గొంతులు నినదించాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాయుద్ధ నౌక గద్దర్, దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సుదర్శన్‌డ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య లాంటి హే మాహేమీలు తెలంగాణపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం గా ఉన్నామన్న సంకేతాలను ఇచ్చారు. ఈ అరుదైన ఘటనలకు వరంగల్ నగరం మరోసారి వేదికైంది. ఉద్యమ కార్యాచరణలో శత్రువు ఎవరో తెలిసిపోయిందని, వాళ్ల భరతం పట్టడమే మిగిలిందని కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది.
(టీ ప్రతినిధి, వరంగల్) [నమస్తే తెలంగాణ సౌజన్యంతో]