mt_logo

తెలంగాణ గెలిచి తీరాలె

By: శివ బోడేపల్లి

మేము మళ్ళీ ఓడిపోయాం. వాళ్ళు మళ్ళీ మా పైన గెలిచారు.

కానీ మేం నిరాశపడం. రెట్టించిన పట్టుదలతో, ఈసారి గెలవటానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తం.

ఎందుకంటే ఈ దేశంలో ప్రజస్వామ్యాన్ని కాపాడవలసిన బాద్యత కూడ మాపైన ఉన్నది అని మాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అందుకోసమైనా మేము గెలిచితీరాలి.

మా గెలుపు ఈ దేశానికి ఒక పెద్ద గుణపాఠం కాభోతుంది. డబ్బుతో ఏమైనా చేయవచ్చు, డబ్బుతో ఎవరినైన కొనవచ్చు అనుకునే వారికి, అది అన్నివేళలా సాద్యం కాదు అని ఈ దేశ ప్రజలకు మా గెలుపు చాటిచెబుతుంది.

మెజారిటీ ప్రజలు ఉన్న ప్రాంతం మైనారిటీ ప్రజలు ఉన్న ప్రాంతాన్ని ఎట్లాగైనా దోచుకోవచ్చు అని అనుకునే వారికి మా గెలుపు చెంపపెట్టు అవుతుంది .

ప్రజలకు పాలకులు సేవకులు మాత్రమే అని మా గెలుపును చూసిన వారందరికీ అర్థమవుతుంది.

రాజకీయ, సామాజిక చైతన్యం ఒకరిద్దరిలో ఉంటే సరిపోదు, అది నేటి సమాజంలో అందరికి ఉండవలసిన కనీస పరిజ్ఞానం అని వాటి అవశ్యకతని మా గెలుపు ప్రపంచానికి వివరించబోతుంది.

కులాల కుమ్ములాటలను, మతాల మదంను ప్రజల మనసులకు ఎక్కించి, ప్రజల ఐకమత్యన్ని దెబ్బతీసి వారిని దోపిడీ చేయవచ్చు అనుకునే వారికి, అట్లాంటి దోపిడీ నిరంతరం సాద్యం కాదు అని మా గెలుపు నిరూపించబోతుంది.

చదువు అంటే కేవలం పుస్తకాలు చదవటం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చదవాలి అని మా గెలుపు ప్రపంచానికి తెలియజెపుతుంది.

బతకటం అంటే ‘నేను మాత్రమే తినటం’ అని అనుకునేవారికి, ఆ భావన తప్పని, మన చుట్టూ ఉన్నవారి ఆకలిని గుర్తించటమే నిజమైన జీవితమని కూడా మా గెలుపు ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్నది.

రాజకీయం అంటే డబ్బు వెదజల్లి గెలవడం కాదు, ప్రజల మనసులను గెలవడం ద్వారానే అది సాధ్యమనే కొత్త రాజకీయాన్ని మా గెలుపు ఆవిష్కరించబోతున్నది.

ప్రజాప్రతినిధులను ప్రజలే ఎట్లా ముందుండి ఎట్లా నడపగలరో, మా గెలుపు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయబోతుంది .

అందుకోసమైనా మేము గెలిచి తీరాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *