రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీని ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మాసిటీతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామంలో రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టుదలతో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారని.. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ కృషితో ఫార్మాసిటీ ఏర్పడే గ్రామాలకు రూ.10కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఘననీయంగా అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే రూ.70కోట్లు చెల్లించారని మరో రూ.100కోట్లు రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లు తెలిపారు.
రూ.1.10కోట్ల పనులకు శంకుస్థాపన :
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మహేశ్వరం 7వ వార్డు, రామచంద్రగూడ గ్రామాల్లో మిషన్‌భగీరథ వాటర్ ట్యాంక్, సంపుల నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి రూ.1కోటి 10 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ గ్రామాలకు అధిక నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు.