By డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
(వ్యాసకర్త: బీసీ కమిషన్ సభ్యులు)
ఒక దార్శనికునికి ఉండే శాశ్వత దృష్టితో కూడిన పాలన, ప్రజా క్షేమం, శాశ్వత ఆనందాన్ని కలిగి ఉండే సమాజ నిర్మాణం, ఆనందంతో దైనందిన జీవితాన్ని గడిపే వర్తమాన సమాజం లక్ష్యాలుగా సాగిన ప్రభుత్వపాలనపై పూర్తిచిత్రాన్ని ప్రజలకు ప్రభావవంతంగా అందించినదే ప్రగతి నివేదనం. అది ప్రజలకు ఆనంద జీవనమార్గాన్ని అందించిన నివేదిక. చిరకాలం తలెత్తుకొని ఆత్మగౌరవంతో, ఆనందంతో జీవించే బంగారు తెలంగాణ నిర్మాణానికి సుదృఢమైన పునాదిగా ఈ నాలుగున్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనను చెప్పవచ్చు.
నీరెప్పడూ పల్లం వైపు చూచినంత సహజంగా నాయకులు ఎప్పుడూ ప్రజలవైపు చూస్తుంటారు. ప్రజల వైపు చూడటం అంటే ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచించడంతో పాటు ప్రజలకు చేసిన పని ఎలా చెప్పాలనే ఆలోచన, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనే యోచన, వారు ఎవరి కోసం తపిస్తున్నారో, ఆ ప్రజలనే ప్రత్యక్షంగా చూడాలనే వాంఛ ఇవన్నీ ప్రజలవైపు చూడటంలో ఇమిడి ఉంటాయి.
ప్రభుత్వం ఏం చేస్తున్నదో ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియడమనేది ప్రజాస్వామ్య పాలనలో తొలి సూత్రం. ఇది ప్రభుత్వ ప్రకటనల ద్వారా తెలియడమనేది ఒక మార్గం అయితే… పాలకుడే ప్రజల ఎదురుగా వచ్చి నిలబడి వివరించడమనేది మరింత ప్రభావవంతమైన మార్గం. ప్రత్యక్షంగా విశ్వసించదగిన పద్ధతి. ప్రగతి నివేదన సభ ఈ సూత్రాన్ని సాకారం చేసింది. బహుశా ఇది ఇంతకు ముందు ఏనాడు జరుగని విశేషం. కేవలం ఓట్లు, పదవి, అధికారం మేరకు ఆలోచించేవాడు మామూలు నాయకుడవుతాడు. పాలించాలి, తన ఐదేండ్లకాలంలో ప్రజాహితం చేయాలనుకునేవాడు పాలకుడవుతాడు. కానీ రాష్ట్రాన్ని బహుముఖీన ప్రగతి పథానికి తీసుకుపోవడంలో కనీసం ఒక వందేండ్లు ముందు కాలాన్ని దర్శించి, ప్రజలకు ఏ అవసరాలుంటాయి ఆ కాలానికీ ప్రజల బహుముఖీన జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలనుకొని ప్రణాళికలు రచించేవాడు, వాటిని దశలవారీగా అమలు చేసేవాడు దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అవుతాడు. బంగారు తెలంగాణ అనే స్వప్నాన్ని మస్తిష్కంలో నింపుకొని నిరంతరం శ్రమించే ప్రజానాయకుడు కేసీఆర్ ఈ మూడోస్థాయి దార్శనికుడు. సెప్టెంబర్ 2న జరిగిన ప్రగతి నివేదనసభ అందుకు ప్రత్యక్ష నిదర్శనం. చేసిన పనిని చేయబోయే ఆలోచనను ప్రజల ముందుపెట్టి ప్రజాస్వామ్య అధికారానికి తుది మెట్టయిన ప్రజల ఆశీస్సు పొందే లక్ష్యంతో ఏర్పాటైందే ఈ ప్రగతి నివేదనం.
కేసీఆర్ కేవలం తన పాలనాకాలంలో నాలుగైదేండ్లు ఉండి, తాత్కాలిక ఫలితాలనిచ్చే సంక్షేమ పథకాలు, ఆకర్షణీయ పథకాలపై మాత్రమే ధ్యాసపెట్టి ప్రజలను తనవైపునకు ఆకర్షించవచ్చు. కానీ ఆ పని మాత్రమే చేసి ఆగిపోతే ఆయన దార్శనికుడు అయ్యేవాడు కాదు. తెలంగాణ గడ్డపైన రాబోయే ప్రజా సంతతి కనీసం ఒక వందేండ్లు ఆనందంతో జీవించడానికి ఆలోచించి చేసిన పథకాలే తాగు, సాగునీటి పథకాలు. తెలంగాణలో డెల్టా భూమి లేదు. అన్ని ప్రాంతాలకు కలిసివచ్చే జీవనదులు లేవు. కృష్ణా, గోదావరి నదులు, వాటిపై అప్పటిదాకా ఉన్న సాగునీటి పథకాలు తెలంగాణ ప్రజలను అన్నివిధాలా ఆదుకోలేకపోయాయి. నాగార్జున సాగరం కుడికాలువ తెలంగాణ గడ్డను ఆదుకోలేకపోయింది. చాలా ఆలస్యంగా వచ్చిన ఎడమ కాలువ ప్రాజెక్టుకు దాపులోనే ఉన్న నల్లగొండ జిల్లాకు, పట్టణానికి కూడా నీరివ్వలేని స్థితిలో కునారిల్లింది. ఇక గోదావరి నీరు 90 శాతం కడలికి ఉరుకులు పెట్టేది. దానిపైన ప్రాజెక్టు ఎస్సారెస్పీ చాలా పరిమిత ప్రయోజనాలనే ఇచ్చింది.
ఈ పరిస్థితిలో తెలంగాణ గడ్డ మొత్తానికి సాగునీటిని అందించే పథకాలను ఆవిష్కరించడం వాటిని సాకారం చేయడం కేసీఆర్ దార్శనికతకు తొలి నిదర్శనం. అప్పటికే ఉన్న పథకాలు మరింత సార్థకమయ్యేలా కొత్త రూపునివ్వడం, ఈ పథకాలు చేరని కొత్త ప్రాంతాలకు, సరికొత్త పథకాలకు రూపకల్పన చేయడం, తెలంగాణను రాబోయే శతాబ్దంలోనైనా నీటి కొరత లేనిదానిగా చేయాలనే కాంక్షలోనుంచి పుట్టిన ఆలోచనలే కేసీఆర్ పథకాలు. శాసనసభ సాక్షిగా చేసిన దృశ్యరూప ప్రదర్శనలో కేసీఆర్ చూపిన నీటి పథకాలు, వాటి అమలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. తెలంగాణ నేలపైన, నీటి వనరులపైన ఇంతటి స్పష్టమైన అవగాహన ఇప్పటిదాకా ఏ నాయకునికి లేదని వైరిపక్షాల్లో ఉన్నవారు కూడా మెచ్చుకున్నారు.
ఎండిపోయన నేలకు బీడుబడిన పొలాలకు, పైకివచ్చిన పక్కటెముకలకు ప్రతినిధిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంత విస్తారమైన నేలలో వరిపంట పండటమనేది అక్కడి ప్రజానీకానికి శతాబ్దాలుగా అచుంబితంగా ఉన్న స్వప్నం. కానీ అది ఈ పథకాల్లో సాకారమైంది. వలస ప్రజానీకాల తట్టబుట్ట సర్దుకునే వలసజీవుల రెక్కల చప్పుళ్ళకు ఆలవాలమైన పాలమూరు ప్రాంతంలో వరిపంట పండటం, అక్కడినుంచి వలసలు ఆగిపోవడమనేది ప్రజలకు వచ్చిన తక్షణ ప్రయోజనం మాత్రమే కాదు. అవి శాశ్వతంగా వారి ముఖాలపైన ఆనందహాసాన్ని అందించే శాశ్వత నీటి పారుదల పథకాలే. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకే కాదు కోదాడ నుంచి కొడంగల్ వరకు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని క్షేత్రాలకు సాగునీరు చేరి బంగారుపంటలు పండాలనేదే కేసీఆర్ స్వప్నం. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్, వివిధ ఎత్తి పోతల పథకాలు, ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ఇతర పథకా లు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి తదితర పథకాలన్నీ ఈ సుదీర్ఘకాల ప్రయోజనాలు అందించే ప్రణాళికలే.
శాశ్వత సాగునీటి పథకాలు బృహత్ పథకాలు, ఆధునిక దేవాలయాలు ఇవి కేసీఆర్ దీర్ఘదర్శిత్వానికి ప్రథమ స్థానపు పథకాలు. ఇవికాక ప్రముఖమైన సాగునీటి పథకం చెరువుల పునరుద్ధరణ. నగరంలో చెరువులు అన్యాక్రాంతమైనాయి. కాకున్నా వినియోగంలో ఉండవు. ఇక పల్లె ప్రాంతంలోని చెరువులు కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై పూడికపట్టి, నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. ఈ చెరువులు అన్నింటిని పునరుద్ధరించి పూడికతీసి కబ్జా నుంచి చెరవిడిపించి ఈ చెరువులు అన్నింటిని సజీవంగా జీవన వనరులుగా తీర్చే పథకమే మిషన్ కాకతీయ. దీనిద్వారానే పల్లెపట్టులలో ఉన్న కొన్ని వందల చెరువులకు కొత్త జీవం వచ్చింది. ఇప్పటికే జలకళ నిండింది. నగర ప్రాంత చెరువులు కూడా, కబ్జాకోరల నుంచి విముక్తమై తిరిగి నీరు నిండి కొత్త వనరుగా మారి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన జీవితంలో, అత్యంత ప్రధానమైన జీవన వనరు నీరు. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించే పథకం మరొక దీర్ఘకాలిక దీర్ఘదర్శన పథకం. మిషన్ భగీరథ పేరుతో సాగిన ఈ పథకం తొలి ఐదేండ్లలోనే పూర్తికావచ్చింది. ఇంకొక నెలాపక్షంలో పూర్తవుతున్న ఈ పథకం ఫలాలు ఇప్పటికే ప్రజలకు చేరువయ్యాయి.
భూమి కలిగి ఉండటమనేది మనిషి అస్తిత్వానికి చిహ్నం. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికిన్ తిన్నది పుష్టి అనేది మహాకవి వాక్యం. మనిషికి వెనుక ఉన్నదే పుష్టి. అది డబ్బుకన్నా నేల ప్రధానమైన వనరు. ఈ నేల వివాదదాస్పదమై ఏ పథకాలు ప్రవేశపెట్టి నా అసలుదారు ఎవరు, దున్నేది ఎవరు ఎవరిది ఎవరికి అమ్ముతున్నా రు ఏం తెలియని అయోమయ స్థితులు నెలకొన్న ఘట్టాలు కోకొల్లలు. అసలు ప్రభుత్వ భూములను గుర్తించలేక అన్యాక్రాంతమవుతున్న పరిస్థితి. గ్రామకంఠం భూములు అసైన్డ్ భూములు కబ్జా అయ్యే దుస్థితి. తెలంగాణ నేలపైన ఉన్న భూ వివరాలు అన్ని సరికొత్తగా ప్రతి అంగుళం రికార్డెడ్‌గా ఉండాలనే కాంక్షతో నూతనపథకాన్ని రచించింది కేసీఆర్ ప్రభుత్వం. భూ దస్త్రాలు ప్రక్షాళనదిశగా భూ రికార్డుల పునర్మూల్యాంకనం చేయించి ప్రతి పట్టాదారుకు పాస్‌బుక్ ఇవ్వడం, ఇది ప్రతి అవసరాలకు ఆలంబనగా నిలిచేటట్టుగా రూపకల్పన చేయడం భూ వివాదాలకు, కబ్జాలకు అనధికారిక ఆక్రమణలకు తెరవేయడం ఈ పథకానికి లక్ష్యం. తెలంగాణ నేల మొత్తాన్ని పునర్ సర్వే చేయించి భూ నిర్ధారణ పథకం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రజలకు కలుగుతాయి. ఎక్కడా వివాదాస్పద రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదు. ప్రతి భూమి వివరం ఇంటర్‌నెట్‌లో పొందుపరుచడం వల్ల ఎక్కడా అవినీతిలేకుండా ఆపడం, అన్యాక్రాంతం కావడం అనధికారిక రిజిస్ట్రేషన్‌కు గండిపెట్టడం వంటి దుశ్చర్యలకు అడ్డుకట్టవేయడం మాత్రమేగాక నిజమైన భూమి హక్కుదారుకు రక్షణ కలిగించడంలో ఈ పథకం ఇప్పటికే సఫలమైంది. చారెడు నేల ఉన్నవాడికైనా, ఎకరం కమతం ఉన్న బక్కరైతుకైనా, వంద ఎకరాలున్న మోతుబరికైనా, భూ వివాదం పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుంది. వీటన్నింటిని దూరం చేసేదే ఈ పథకం.
ఇది ప్రజలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికీ ఎంతో సౌకర్యాన్ని వివాదరహిత మార్గాలను ఎంచుకునే వీలు కలిగించే పథకం. ఏ పథకానికి భూమిని ఎంచుకోవాలన్నా తక్షణం ప్రభుత్వభూమిని గుర్తించి ఎంపిక చేసుకోవడానికి వీలు కలిగించే పథకం. ధరణి వెబ్‌సైట్ సుదీర్ఘకాలంగా అసంకల్పితంగా ఉన్న అత్యుత్తమ ప్రభుత్వ పథకం కేసీఆర్ నూరేండ్ల ముందుచూపునకు ఇది తార్కాణం. రైతుబంధుతో ఆర్థిక చేయూత, రైతుబీమాతో జీవన భద్రత కల్పించి రైతన్నను గౌరవిస్తున్న తీరు దేశానికే మార్గదర్శకం.
నీరెప్పడూ పల్లం వైపు చూచినంత సహజంగా నాయకులు ఎప్పుడూ ప్రజలవైపు చూస్తుంటారు. ప్రజలవైపు చూడటం అంటే ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచించడంతో పాటు ప్రజలకు చేసిన పని ఎలా చెప్పా లనే ఆలోచన, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనే యోచన, వారు ఎవరి కోసం తపిస్తున్నారో, ఆ ప్రజలనే ప్రత్యక్షంగా చూడాలనే వాంఛ ఇవన్నీ ప్రజలవైపు చూడటంలో ఇమిడి ఉంటాయి. ప్రతి ప్రజానాయకుడు అందునా ప్రభుత్వ సారథ్యం వహించే నాయకుడు ఈ అన్ని కోరికలను కలిగి ఉంటాడు. కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన నాయకుని ఈ లక్షణాలకు ప్రతిబింబంగా నిలిచింది.