mt_logo

పెట్టుబడులతో రండి

-సౌకర్యాల కల్పన బాధ్యత మాది
-సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు
-మాది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
-పరిశ్రమల కోసం ల్యాండ్ బ్యాంక్ సిద్ధం
-జీరో కరప్షన్, సింగిల్ విండో మా విధానం
-హైదరాబాద్ సురక్షిత నగరం
-సింగపూర్ బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి
-పారిశ్రామిక విధానాల వివరణ
-సందేహాలకు సవివర సమాధానాలు
-విజయవంతమైన పారిశ్రామిక సదస్సు
-పెట్టుబడులకు సింగపూర్ ఆసక్తి

హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ. జీరో కరప్షన్.. సింగిల్ విండో మా విధానం. భూములే కాదు సౌకర్యాల కల్పన బాధ్యత కూడా మాదే. పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు ప్రారంభించండి ఇదీ గురువారం సింగపూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రసంగ సారాంశం.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ఆయన సుదీర్ఘంగా అనర్గళంగా అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలిచ్చి సందేహాలు తీర్చారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టిన చర్యలనుంచి పారిశ్రామిక విధానంలో చోటు చేసుకుంటున్న సింగిల్ విండో, చేజింగ్ సెల్, భూ విధానం, పారిశ్రామిక జోన్లు, క్లస్టర్లు, రాజధాని చుట్టూ తలపెట్టిన వివిధ రంగాలకు చెందిన సిటీలు తదితర అంశాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అక్కడి రిట్జ్ కారల్టన్ మిలీనియా హోటల్‌లో సీఐఐ బిజినెస్ ఫోరం, హై కమిషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన బిజినెస్ మీట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పెట్టుబడితో వస్తే ఉత్పత్తి ప్రారంభమే..
ఏదో భూములు కేటాయించాం.. మీరే పరిశ్రమలను నెలకొల్పుకోండి అనేది మా విధానం కాదు. గత పాలకులు ఆ విధానాన్ని అనుసరించారు. కానీ మేం ప్లగ్ అండ్ ప్లే విధానంగా ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర అన్ని రంగాలకూ ఇదే పద్ధతి ఉంటుంది.

పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే చాలు. స్థలాన్ని చూపి వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు ఆరంభించేటట్లుగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉంటుంది అని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ప్రతి పెట్టుబడిదారుడికి విశ్వాసాన్ని చూపిస్తామన్నారు. గత ప్రభుత్వాల్లో అవినీతి ఉండేది. అందుకే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు భయపడ్డారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. జీరో కరప్షన్ ఉంటుంది అని సీఎం హామీ ఇచ్చారు.

ల్యాండ్ బ్యాంక్ మా ప్రత్యేకత
తెలంగాణలో అతి పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. అది నిజాం కాలం నుంచి వారసత్వంగా వస్తున్నది. అదే మా ప్రత్యేకత. మరెక్కడా ఇంత భూమి అందుబాటులో లేదు. తెలంగాణకు దేశంలోని అన్ని ప్రాంతాలతో అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నాయి. అందుకే అభివృద్ధి, పారిశ్రామీకరణ ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా చర్యలు చేపట్టాం. జిల్లాల్లోనూ సమాన అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. పారిశ్రామికవాడలు కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. ఏ ఇండస్ట్రియల్ క్లస్టర్ల నుంచి బయలుదేరినా హైదరాబాద్‌కు 90 నుంచి 120 నిమిషాల్లోనే చేరుకునే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం అని కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్
భావి తరాలకు కూడా ఇబ్బంది కలుగకుండా హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నగరం సమీపంలో ఫార్మాసిటీని నిర్మిస్తున్నామని, దాంట్లో నివాస సముదాయాలతో పాటు కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కూడా ఉంటాయని చెప్పారు. ఫార్మాతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్‌కు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇలాంటి సిటీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఆలోచన ఉందన్న సీఎం ఈ రంగంలో పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు.

శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ పటిష్ట పరుస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో ఆధునిక వాహనాలు, ఇతర పరికరాలను సమకూర్చి భద్రతను ఆధునీకరించినట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, సింగపూర్‌లో ఆచరణలో ఉన్న చట్టాలను తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రకటించారు. సేఫ్టీ, సెక్యూరిటీ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

సోలార్ పార్కులు..
రాష్ట్రంలో 6 వేల ఎకరాల్లో సోలార్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. నేషనల్ సోలార్ కార్పొరేషన్‌తో కలిసి అనేక సోలార్ ప్లాంట్లు నిర్మించబోతున్నాం అని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్తు లోటు ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కోల ద్వారా అదనంగా ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం అని తెలిపారు. రానున్న మూడు, నాలుగేళ్లలో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

సలహాలివ్వండి, స్వీకరిస్తాం
పారిశ్రామిక విధానం మీద ఇంకా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికరంగ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను స్వీకరిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సింగిల్‌విండో విధానంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే స్పెషల్ చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే స్పెషల్ చేజింగ్ సెల్ సింగిల్ సమావేశంతో అనుమతి పత్రాలను చేతిలో పెడుతుందని వివరించారు. విమానాశ్రయంలో పెట్టుబడిదారులు దిగగానే అన్ని ప్రక్రియలను అధికారులే సమన్వయం చేస్తారన్నారు.

పారిశ్రామికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతున్నదని సదస్సులో మాట్లాడిన రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర చెప్పారు. ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ ఆధారంగా తెలంగాణకు పెట్టుబడులు విస్తారంగా వస్తాయన్న నమ్మకం ఉందన్నారు.

తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భారత్ నడిబొడ్డున ఉందని, ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా ఇమిడిపోగల ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉందని చెప్పారు. హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ నగరంగా, శాంతిభద్రతలతో తలతూగుతున్నదని తెలిపారు. అన్నింటికి మించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానంతో ప్రభుత్వం పని చేస్తున్నదని కొనియాడారు.

ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా నెలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను తమ సంఘం తరపున ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బిజినెస్ సమ్మిట్‌లో సింగపూర్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానంపై పలు ప్రశ్నలు అడిగారు. దానికి సీఎం సమగ్రంగా సమాధానమిచ్చి వారిని ఆకర్షించారు.

సింగపూర్‌లోని తెలంగాణ పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. కార్యక్రమంలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కే సుధీర్‌రెడ్డి, ఎం గోపాలరావు, ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీ అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ జోన్లు
ఏదో భూములు కేటాయించాం.. మీరే పరిశ్రమలను నెలకొల్పుకోండి అనేది మా విధానం కాదు. గత పాలకులు ఆ విధానాన్ని అనుసరించారు. కానీ మేం ప్లగ్ అండ్ ప్లే విధానంగా ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర అన్ని రంగాలకూ ఇదే పద్ధతి ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే చాలు. స్థలాన్ని చూపి వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉత్పత్తులు ఆరంభించేటట్లుగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉంటుంది
– సింగపూర్ పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం కేసీఆర్

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *