mt_logo

ఇది ప్రజాస్వామిక విప్లవం

By: కట్టా శేఖర్ రెడ్డి

తెలంగాణ ఒక గుణాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏ సమాజంలోనైనా విప్లవాత్మకమైన మార్పులు తేగలిగినవి తాగునీరు, సాగునీరు, కరెంటు, భూమి పంపిణీ, ఉపాధి కల్పన… మిగలినవన్నీ సంక్షేమ పథకాలే తప్ప పునాదుల్లో మార్పు తేగలిగినవి కాదు. ఆంధ్ర సమాజం మనపై ఆధిపత్యాన్ని సాధించగలిగింది సాగునీరు, అది సృష్టించిన సంపదలతోనే. ఈ మార్గంలో మనం ఎంతదూరం ప్రయాణం చేయగలమన్నదే అతిముఖ్యమైన సమస్య.

ఇది విప్లవం కాదా? ఇది ప్రజాస్వామిక విప్లవం. నా జీవితకాలంలో చూడలేననుకున్నది చూశాను. ఇంతకంటే గొప్పమార్పేమి కావాలి? ఎప్పుడూ ఓడిపోతూ వచ్చిన తెలంగాణ ఇప్పుడు గెలిచింది. నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ పెద్ద మనిషి ఉద్వేగంతో చెబుతున్నారు. మెతుకుసీమలో ఓ కుగ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఓ బక్కపలుచని మనిషి రాష్ట్రాధినేతగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సమున్నతంగా ఎగరేయడం, అక్కడే దళిత మహిళలకు భూమిని పంపిణీ చేయడం, నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయడం ఒక అసాధారణ సన్నివేశం.

ఈ దృశ్యమే ఆ పెద్దమనిషిని ఉద్వేగానికి గురిచేసింది. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. కాకతీయుల కోటలో ఓ దళిత నాయకుడు పతాకాన్ని ఎగురవేశారు. కరీంనగర్‌లో విద్యార్థిగా ఈ వ్యవస్థపై పోరాడిన ఓ బీసీ నాయకుడు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డిలో మనలో మనిషి, జనం తలలో నాలుక హరీశ్‌రావు పతాకాన్ని ఉన్నతం చేశారు. సికింద్రాబాద్‌లో అందరిలో ఒకడిగా, అతి సామాన్యంగా జీవించే పద్మారావు ఖమ్మంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పిల్లల్లో పిల్లవాడిలా, పెద్దల్లో పెద్దవాడిలా మెలిగే ఒక సాధారణ రైతు బిడ్డ జగదీశ్‌రెడ్డి నల్లగొండలో జెండా ఎగురవేస్తుంటే ఇంకా కలగానే అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమ విద్యార్థిగా మొదలయి, అనతికాలంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ అధికార స్వరంగా పేరుతెచ్చుకున్న కల్వకుంట్ల తారకరామారావు మహబూబ్‌నగర్‌లో పతాకాన్ని ఎగురవేస్తుంటే ముచ్చటేసింది. అనుభవజ్ఞులే అయినా సమైక్య రాష్ట్రంలో రాజకీయ వివక్షకు గురైన జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాలు ఎగురవేయడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించినట్టు అనిపించింది. నిరుపేద కుటుంబాల నుంచి పోరాడి ఎదిగివచ్చిన ఇద్దరు బీసీ నేతలు తెలంగాణ చట్టసభల అధ్యక్షులుగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ పతాకాలు ఎగురవేయడం తెలంగాణ స్వాతంత్య్రానికి ప్రతీక.

ఇది తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబరులోనే విముక్తి పొందినా 1952 దాకా మిలటరీ, సివిల్ పాలనలోనే ఉంది. ఆ తర్వాత ఒక్క నాలుగేళ్లు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నా అది తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మరట్వాడాలు కలసి ఉన్న ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం. స్వచ్ఛమైన తెలంగాణ రాష్ట్రం అవతరించింది ఇప్పుడే. ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి పొందడం మరో స్వాతంత్య్రం. తెలంగాణలో మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత రాజకీయాల నుంచి విముక్తి పొందడం మూడో స్వాతంత్య్రం. ఇన్ని శుభ సందర్భాల మేళవింపు ఈ స్వాతంత్య్ర దినోత్సవం. అందుకే చాలా మంది భావావేశానికి లోనయ్యారు. గోల్కొండ కోటలోపల సభావేదిక అంతటా అందరి ముఖాల్లో తెలంగాణ జోష్ కనిపించింది.

తెలంగాణ ఒక గుణాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏ సమాజంలోనైనా విప్లవాత్మకమైన మార్పులు తేగలిగినవి తాగునీరు, సాగునీరు, కరెంటు, భూమి పంపిణీ, ఉపాధి కల్పన… మిగలినవన్నీ సంక్షేమ పథకాలే తప్ప పునాదుల్లో మార్పు తేగలిగినవి కాదు. ఆంధ్ర సమాజం మనపై ఆధిపత్యాన్ని సాధించగలిగింది సాగునీరు, అది సృష్టించిన సంపదలతోనే.

ఈ మార్గంలో మనం ఎంతదూరం ప్రయాణం చేయగలమన్నదే అతిముఖ్యమైన సమస్య. రాజకీయాల్లో ఈ మార్పు శాశ్వతం కాదు. రాజకీయాలు, నాయకులు ఒక నీటి మడుగులా మారి, తెట్టులా పేరుకుపోయినప్పుడు మార్పును ఆశించలేం. నాయకులు ప్రజలకు దూరమవుతారు. మ్యానిపులేషన్స్‌తో చాలా మంది నాయకులు ఎన్నికల వ్యాపారులుగా మారతారు. ప్రజలకు అవసరమైన పనులు జరగవు. నాయకులకు, మధ్య దళారీలకు అవసరమైన పనులు మాత్రమే జరుగుతూ ఉంటాయి. 1983లో ఎన్‌టిరామారావు తెలుగుదేశంపార్టీ పెట్టి, ఒక ప్రవాహంలా వచ్చి అటువంటి ఒక తెట్టును ఊడ్చి పారేశారు. కొత్త నాయకత్వాన్ని ఆవిష్కరించారు.

అప్పటిదాకా సమాజాన్ని ఏలిన సామాజిక వర్గాల ఆధిపత్యం క్షీణించి కొత్త నాయకత్వం అవతరించింది. వెనుకబడిన తరగతుల నాయకులు అనేకమంది రాజకీయ అవనికపై ఒక్క వెలుగు వెలిగారు. విషాదం ఏమంటే ముప్ఫైఏళ్లు పూర్తయ్యేసరికి ఆ సామాజిక వర్గాల్లోని నాయకత్వం కూడా ఒక తెట్టులాగా, నిలవ నీరులాగా మారిపోయారు. ఒక క్రీమీ లేయర్ అవతరించింది. వారు కూడా ప్రజా రాజకీయాలను వదలి అధికార రాజకీయాలకు రుచి మరిగారు. కొత్త పెత్తందారులు ఎదిగివచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కదలి వచ్చి నిలబడ్డారు కానీ, కాంగ్రెస్, టీడీపీల్లో తెట్టులా పేరుకుపోయిన ఈ నాయకత్వాలు చలించలేదు. కాలం చెల్లి గిడసబారిపోయిన పాత రాజకీయ వ్యవస్థను కాపాడుకోవడానికి, దానితో అంటకాగడానికే కృషిచేస్తూ వచ్చారు. ప్రజలతో నడవడానికి, మమేకం కావడానికి ఇష్టపడలేదు.

అందుకే తెలంగాణ రాజకీయ ఉప్పెన వారిని ముంచేసి కొత్త రాజకీయాలను తెచ్చింది. పేద, మధ్యతరగతి, వెనుకబడిన తరగతుల కుటుంబాల నుంచి సగానికి పైగా కొత్త నాయకత్వం చట్టసభలకు ఎన్నికయ్యారు. వీళ్లంతా జనం మధ్య, జనంకోసం పనిచేసిన ఉద్యమ నాయకులు. వీళ్లకు కొత్త ఆలోచనలు ఉన్నాయి. ప్రజలకు ఏదో చేయాలన్న తాపత్రయం ఉంది. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. తెలంగాణ నుంచి ఇంత మంది ఎంపీలు, ఇంత స్పష్టమైన రాజకీయ దృక్పథంతో ప్రాతినిధ్యం వహించిన సందర్భం ఇంతకుముందు లేదు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది కేసీఆర్ సాధించిన విజయం. తెలంగాణ అదృష్టం.

అయితే ఇది శాశ్వతం కాదని చరిత్ర చెబుతున్నది. రాజకీయాలు, నాయకత్వాలు ఒక ప్రవాహంలా నిత్యనూతనంగా తమను తాము ఆవిష్కరించుకున్నప్పుడే కొనసాగింపు ఉంటుంది.తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకత్వం చేయాల్సింది చాలా ఉంది. నిలవ నీరు కాకుండాచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రవాహంలాగా, గతిశీల స్వభావంతో ప్రజల మనుషులుగా రాజకీయాలను కొనసాగించాల్సి ఉంది. తాత్కాలిక ఉపశమనాలతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు మాత్రమే తెలంగాణను కాపాడగలవు. రుణ మాఫీ, పెన్షన్లు, సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనాలు. మూల చికిత్స చేయనంతవరకు తెలంగాణ సమాజాన్ని సంక్షోభం నుంచి బయటికి తీసుకురాలేము. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్, టీడీపీలకు ఈ విషయంలో విమర్శించే నైతిక హక్కు లేకపోవచ్చు. కానీ ఆత్మహత్యల సమస్యకు స్పందించాల్సిన నైతిక బాధ్యత మన ప్రభుత్వానికి, సమాజానికి ఉంది. అనేకసార్లు మాట్లాడుకున్నాం. అయినా మళ్లీ మళ్లీ మాట్లాడుకోవాల్సిన అంశమే. గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకోరు? ఎందుకంటే అక్కడ వ్యవసాయం గిట్టుబాటుగా ఉంది. సాగునీటి ఖర్చు చాలాచాలా తక్కువ. కరెంటు ఖర్చు దాదాపు లేదనే చెప్పాలి. రైతులు క్షేమంగా ఉన్నారు. ఆదాయం సృష్టించుకోగలుగుతున్నారు. మనకు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయం చేయడమంటే ఒక పరిశ్రమను నడిపినంత కష్టం. రైతు లేక కౌలు రైతు తన కష్టాన్నంతా సాగునీటికోసం ధారపోయవలసి వస్తోంది. అప్పులపాలవుతున్నారు. ఆగమవుతున్నారు. అందుకే మన సమస్యకు మూలం సాగునీటిలో ఉంది. సాగునీరు, అదీ కాలువల నీరు ఇవ్వగలిగితే సగం సమాజం విముక్తమవుతుంది. కరెంటు అవసరం కూడా దానంతట అదే తగ్గిపోతుంది. సాగునీటిని అందించడం మనకు ఎమర్జెన్సీ. వ్యవసాయం స్వయం సమృద్ధిని సాధిస్తే ప్రజలు ఆర్థికంగా శక్తిమంతులవుతారు. పెట్టుబడులు పుడతాయి. పట్టణాలు కూడా కళకళలాడుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. అందుకే మనం మూలాల్లోకి వెళ్లి అభివృద్ధికి పునాదులు వేయాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *