mt_logo

అక్కడ వసూలు ఇక్కడ గగ్గోలు!

-ఏప్రిల్ 1నుంచే ఏపీలో పర్మిట్ ట్యాక్స్
-అన్ని చెక్‌పోస్టుల్లో దబాయించి వసూలు
-రెండుకండ్ల బాబు ఒంటికన్ను సిద్ధాంతం
-తెలంగాణ మాత్రం వసూలు చేయవద్దంటూ నీతులు
-కండ్లు మూసుకున్న సీమాంధ్ర మీడియా
సీమాంధ్ర వాహనాల మీద తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడంపై నానా యాగీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాను మాత్రం ఈ నెల ఒకటో తేదీనుంచే తెలంగాణ సరుకు వాహనాల మీద పర్మిట్ టాక్స్‌లను దంచి వసూలు చేస్తున్నది. తెలంగాణ నేమ్ ప్లేట్ ఉన్న బండ్లతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన ఏ బండినీ వదలడం లేదు. చివరికి టాటా ఏస్ లాంటి చిన్న వాహనాలపై కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రవేశించగానే ప్రవేశపన్ను వసూలు చేస్తున్నారు.

గుంటూరు, కృష్ణా, కర్నూలు జిలాల్ల చెక్‌పోస్ట్‌ల వద్ద 24 గంటలూ ఈ వసూళ్లు జరుగుతున్నాయి. రవాణాశాఖ అధికారులు పన్ను వసూలు చేసి రశీదులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణనుంచి వెళ్లిన అనేకమంది వాహన యజమానులు, డ్రైవర్లు ఈ పన్ను చెల్లించారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పన్నుల వసూలుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు, తన రాష్ట్రంలో మాత్రం అదే పన్నును దంచి వసూలు చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది. తాను పన్ను వసూలు చేస్తూ ఎదుటివారిపై నింద వేయడమేమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు కేవలం తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని అంటున్నారు. రవాణా చట్టాలకు లోబడి, విభజన చట్టంలోని మార్గ దర్శకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో రీతిగా బద్నాం చేయడం ద్వారా అక్కడ పొలిటికల్ మైలేజీ కోసం ఆయన యత్నిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు విషయం ప్రకటించి బాజాప్తాగానే టాక్స్ వసూలు చేస్తున్నది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు కూడా అమలు పరుస్తున్నది. కానీ ఏపీ సర్కారు మాత్రం ఏ ప్రకటనా లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా వసూలు చేస్తున్నది. పైగా తెలంగాణ ప్రభుత్వం పన్నులు వసూలే చేయకూడదని ఎక్కే గడప, దిగే గడప అన్నట్టు ఎక్కడెక్కడో ఫిర్యాదులకు దిగుతున్నది. ఇక ఇక్కడ పన్నులు వసూలు చేస్తే భూకంపాలు వస్తాయని, ధరలు ఆకాశానికి వెళ్తాయని నానా దుష్ప్రచారానికి దిగిన సీమాంధ్ర మీడియా, ఏపీ పన్నుల వ్యవహారంపై మాత్రం కిమ్మనడం లేదు.

అంతా గోప్యమే: ఏపీ అధికారులు పన్నుల వసూలు వ్యవహారం అంతా గోప్యంగానే జరుగుతున్నది. తెలంగాణ నుంచి ఆంధ్రకు సరుకు రవాణా చేసే ప్రతీ వాహనానికి అక్కడ ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. అయితే అధికారికంగా ఈ విషయం ఎక్కడా ప్రకటించడం లేదు. మీరు వసూలు చేయండి. అక్కడి ప్రభుత్వం వసూలు చేస్తున్న రవాణా పన్నును నిలిపి వేసేవిధంగా కేంద్రంతో మాట్లాడి నిలిపి వేయిస్తా అంటూ చంద్రబాబే అధికారులను పురమాయించారని తెలిసింది. ఆయన మౌఖిక ఆదేశాలతోనే తెలంగాణ నేమ్ ప్లేట్ ఉన్న బండ్లతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలను చిన్న వాహనాలతో సహా ప్రవేశ పన్నును వసూలు చేస్తున్నారని తెలిసింది.

మీడియా మూగనోము: తెలంగాణలో పన్ను వసూలు చేస్తే సీమాంధ్ర మీడియా గగ్గోలు పెట్టింది. అదే మీడియాకు అక్కడ చంద్రబాబు సర్కారు వసూలు చేస్తుంటే మాత్రం కనిపించడం లేదు. తెలంగాణలో వసూలుచేసే రవాణా పన్ను వల్ల ఏ రూట్‌నుంచి వచ్చే ఎన్ని వాహనాలకు ఎంత భారం పడేదీ లెక్కలు వేసి మరీ చెప్పే సీమాంధ్ర మీడియాకు ఇవాళ తెలంగాణ వాహనాల మీద పడుతున్న భారం మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సరుకు రవాణా భారంగా మారిందని, ధరలు పెరిగిపోతున్నాయని మీడియా నిన్నటిదాకా విశ్లేషణలు చేసింది. ఏపీ రాజకీయ పార్టీలను రెచ్చగొట్టి ఉద్యమానికి పురమాయించింది.

తెలంగాణ ఆపరేటర్ల మండిపాటు: ఈనెల ఒకటో తారీఖు నుంచే తెలంగాణ నుంచి వెళ్లే ప్రతి సరుకు రవాణా వాహనంపై ఏపీ ప్రభుత్వం ప్రవేశరుసుం వసూలు చేస్తున్నా తెలంగాణ ఆపరేటర్లు పెద్దగా పట్టించుకోలేదు. అన్ని పొరుగు రాష్ట్రాల్లో చెల్లించిన రీతిగానే పన్నులు చెల్లించారు. తెలంగాణ ఆపరేటర్లు కానీ, డ్రైవర్లు కానీ ఈ ప్రవేశ రుసుంను ఎందుకు వసూలు చేస్తున్నారని ఎక్కడా అడ్డుకున్న దాఖలాలు కానీ, ఇది వద్దని చెప్పిన వైనం కానీ ఎక్కడా వెలుగు చూడలేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్ర సరిహద్దుల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ రుసుం విధించడం సాధారణం. మిగతా రాష్ట్రాలకు ఎట్లాగైతే చెల్లిస్తారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు వేసే ప్రవేశ పన్నును చెల్లిస్తున్నారు. అయితే ఇదే పన్ను తెలంగాణ వసూలు చేస్తే దుష్ప్రచారం చేయడంపై మాత్రం మండిపడుతున్నారు.

అక్కడ అంతా ఒకే మాట..: ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పక్షాలు ఒక్కమాట మీద ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నును నిలిపివేయాలని చంద్రబాబు ప్రభుత్వం డిమాండ్ చేస్తే అక్కడి రాజకీయ పార్టీలు ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అదే డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు అడ్డగోలు వాదనకు వంతపాడుతూ తెలంగాణ సర్కారుపై ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఏకంగా అక్కడి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న రవాణా పన్నును నిలిపివేసే విధంగా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కూడా తెలంగాణ పన్నులు వేయవద్దనే డిమాండ్ చేస్తున్నది. కానీ తెలంగాణలో ఆ ఐక్యత కనిపించడం లేదు. మన ప్రభుత్వం పన్ను విషయం ప్రకటించీ ప్రకటించక ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టాక్స్ విధింపు మీద విమర్శలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదే దారి. వామపక్షాలు, ఇతర పక్షాలు కూడా ఏపీ డిమాండ్‌కు బాసటగా నిలిచాయి. తెలంగాణ తెలుగుదేశం నాయకులు సరేసరి. లేని ఉద్దేశాలు సైతం అంటగడుతున్నారు. ఇపుడు ఏపీ ప్రభుత్వ వసూళ్ల మీద ఏ విధంగా స్పందిస్తారో మరి.

టాక్స్ తీసుకుంటున్నరు..
నేను 5వ తేదీన ఆంధ్రాకు వెళ్తే గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్‌పోస్ట్ దగ్గర ఆపారు. తెలంగాణ బండి ఏపీలో తిరగాలంటే టాక్స్ కట్టాల్సిందే అన్నారు. నాది చిన్నబండి (టాటా ఏస్) అన్నా వినకుండా రూ. 530 తీసుకున్నారు. రశీదిచ్చారు. పెద్ద బండ్లకైతే రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఒకసారి కడితే నెలరోజులకు వర్తిస్తుందట. (అంటే ఒక్కసారి వసూలు చేసిన మొత్తం ఒక నెలకే వర్తిస్తుంది. ఒక నెల పర్మిట్ టాక్స్ లేదా అనుమతి రుసుం అన్నమాట).
-ఎం పురుషోత్తం, టాటా ఏస్ డ్రైవర్

వాళ్ల వసూళ్లు ఫోకస్ కావడం లేదు..
మన ప్రభుత్వం వసూలు చేస్తానని చెప్పి చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు చెప్పలేదు. ఎవరికీ చెప్పకుండానే ఏప్రిల్ 1నుంచే కృష్ణా, గుంటూరు, కర్నూలు సరిహద్దుల్లో తెలంగాణ వాహనాలకు పన్నులు వసూలు చేస్తున్నరు. మన దగ్గర వసూలు చేస్తే ఫోకస్ అవుతుంది.. కానీ వాళ్లు వసూలు చేసిన విషయం ఎవరికీ తెలుస్త లేదు. వాళ్లు చెల్లించే టాక్స్ మాత్రమే ఫోకస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
– కూనూరి శేఖర్‌గౌడ్, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *