mt_logo

రాష్ట్రానికి కేంద్రం నుండి అందే సాయం పెంచండి- సీఎం కేసీఆర్

ఢిల్లీ నుండి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధులు వీకే సారస్వత్, అశోక్ జైన్ లతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గురువారం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్ధిక సంఘం గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రం రుణపరిమితిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని నీతి ఆయోగ్ ప్రతినిధులను కోరారు. తెలంగాణ మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రమైనందున కేంద్రంతో సమానంగా రుణం తీసుకునేందుకు అవకాశం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక పథకాలు చేపట్టిందని, వీటికి సంబంధించి నిధుల ఆవశ్యకత ఉందని వారికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో కోత విధించిన విషయాన్ని, కేంద్ర పథకాలకు కూడా సరిపడా నిధులు రావట్లేదనే అంశాన్నీ సీఎం ఈ సందర్భంగా వారివద్ద ప్రస్తావనకు తెచ్చారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మరియు బడ్జెట్ మేనేజిమెంట్(ఎఫ్ఆర్ బీఎం) మార్గదర్శకాల ప్రకారం రుణసహాయాన్ని పొందడానికి తమ రాష్ట్రానికి వీలు కలుగుతుందని, రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎంతో సమావేశం కంటే ముందు ప్రణాళిక, ఆర్ధిక, నీటిపారుదల శాఖ అధికారులతో నీతి ఆయోగ్ ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *