గురువారం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెండవరోజైన శుక్రవారం కూడా మురికివాడలను సందర్శించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మురికివాడల్లేని ఆదర్శ నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా కేసీఆర్ అక్కడి పేదలకు భరోసా ఇచ్చారు. కాలనీలకు దగ్గరుండి శంకుస్థాపన చేయించి మరీ రాజధానికి వెళ్తానని, శని, ఆదివారాలు కూడా ఇక్కడే ఉండి చెప్పిన అన్ని పనులూ పూర్తిచేసుకునే వెళ్తానని స్పష్టం చేశారు. సమస్యల అంతు చూద్దాం.. అవో, మనమో తేల్చుకుందాం.. అవి ఎట్లా మన దగ్గరికి రావాలో, ఇన్నాళ్ళూ ఎందుకు రాలేదో చూద్దాం అని తేల్చిచెప్పారు. సీఎం పర్యటన నాలుగురోజులపాటు సాగే మేడారం జాతరలా ఉంది.
ఉదయం 9 గంటలకు మొదలైన జనయాత్ర రాత్రి పొద్దుపోయే వరకూ ఏమాత్రం అలుపు లేకుండా కొనసాగింది. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా నాలుగు రోజులు ఒకే జిల్లాలో ఉండి ప్రజల సమస్యలు తీర్చేందుకు కంకణం కట్టుకుని ఉండటం ఇంతవరకూ చూడలేదని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీనదయాళ్ నగర్, ప్రగతి నగర్, అంబేద్కర్ నగర్ మురికివాడల్లో పర్యటించి అక్కడి పేదల సమస్యలు ఓపిగ్గా విన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టిస్తానని, అడ్వకేట్స్ కాలనీలుగా అన్ని సదుపాయాలు ఉండే బస్తీలుగా మారుస్తానని హామీ ఇచ్చారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, ఇప్పుడు ఎన్నికలు లేవని, ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందామని, మన బతుకులు బాగుచేసుకునే ఉపాయం ఆలోచిద్దామని చెప్పారు. వరంగల్ టౌన్ లో 150 నుండి 160 స్లమ్స్ ఉన్నాయని, స్లం లెస్ సిటీగా వరంగల్ ను తీర్చిదిద్దుకుందామని, ఇళ్ళు కట్టుకోవాలంటే కనీసం నాలుగు లక్షలు కావాలని, అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు. ఆదివారం పునాదిరాయి వేసే ఇక్కడినుండి పోతానని, రేపు, ఎల్లుండి మీరు ఎక్కడికీ పోవద్దని, అధికారులకు సహకరించాలన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి పించన్లు వచ్చేలా చూస్తానని కేసీఆర్ తేల్చిచెప్పారు. అనంతరం అర్చక సమాఖ్య నిర్వహించిన సదస్సుకు హాజరైన సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో పది కోట్లతో అర్చక భవన్ నిర్మిస్తామని, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇకపై ఆరువేలకు పెంచుతామని ప్రకటించారు.