mt_logo

వచ్చే ఏడాది లక్షకోట్లకు మించిన భారీ బడ్జెట్ – ఈటెల..

రాబోయే ఆర్ధిక సంవత్సరం(2015-16) కోసం భారీ బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఐదు ప్రాధాన్య అంశాలకు బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నట్లు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో చేసినట్లు అంకెల గారడీలా కాకుండా సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తెలంగాణ వార్షిక బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. సామాన్యుడు సైతం మా బడ్జెట్ అనుకునే రీతిలో కొత్త బడ్జెట్ ను సరళంగా రూపొందిస్తున్నామని, ప్రస్తుతం పదినెలల కాలానికి 1 లక్షా 600 కోట్లకు పైగా ఆమోదించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్ధిక సంవత్సరానికి అంతకన్నా భారీ బడ్జెట్ ను ప్రజల ముందుకు తీసుకురానుందని ఈటెల తెలిపారు.

ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నిలకడగా ఉందని, అనుకున్న రీతిలో ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2014-15)లో పది నెలల పాలనకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను వచ్చే మూడునెలల్లో ఖర్చుచేసి తమ సత్తా చూపుతామని, రాష్ట్ర ఆదాయం గొప్పగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంచనాకు మించి అవుతున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 5 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, ఇటీవల జరిగిన తన ఢిల్లీ పర్యటనలో ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళానని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *