– కె.శ్రీనివాస్
విశాలాంధ్రలో విలీనానికి సంబంధించి అనుకూల ప్రతికూల అంశాలను నేనిక్కడ రేఖామాత్రంగా సూచించాను. నా సొంత అభిప్రాయమంటూ ఒకటి చెప్పడం భావ్యం కాదని అనుకుంటున్నాను. ఈ అంశంపై నా మనసును తెరచే ఉంచాను. నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిస్థితిని వివరించాను. బొంబాయి నుంచి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత మరింత వివరంగా రాస్తాను. …” 1955లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు కాంగ్రెస్ అధ్యక్షులు యు.ఎన్. ధేబర్‌కు రాసిన లేఖలో రాసిన ముగింపు వాక్యాలు అవి. విశాలాంధ్రలో కలవాలనే అభిప్రాయం కూడా తెలంగాణలో బలంగానే ఉన్నదని, అయితే మెజారిటీ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండడానికే మొగ్గుచూపుతారని కూడా బూర్గుల ఆ లేఖలో సూచించారు.
ఫజల్ అలీ కమిషన్ నివేదిక వెలువడి, విశాలాంధ్ర ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న సందర్భంలో బూర్గుల రాసిన లేఖ అది. ఒక రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్య కాదది, రాజకీయంగా ప్రాంతాలుగా విడిపోయిన సందర్భమూ కాదది. ఒక బహుభాషారాష్ట్రం మూడుముక్కలుగా విచ్ఛిన్నమై నామ రూపాలు లేకుండా పోయే సన్నివేశం. ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా, బహిరంగంగా చెప్పడానికి ఏ అభ్యంతరం ఉండనక్కరలేదు. అయినా, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ, తన మనోగతాన్ని బాహాటంగా ప్రకటించి రాజకీయపరిస్థితులను ప్రభావితం చేయకూడదనే విలువను ఆయన పాటించి, పార్టీ అధ్యక్షుడికి రహస్యలేఖను మాత్రమే పంపించారు.
తరువాతి పరిణామాలు తన ప్రాంత ప్రజల మెజారిటీ అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పటికీ ఆయన ఆ ప్రక్రియతో సహకరించారు. విశాలాంధ్రకే అనుకూలంగా, హుందాగా వ్యవహరించారు. ఢిల్లీకి వెళ్లి చివరి సమ్మతి చెప్పి వచ్చిన సందర్భంలో ‘నా మరణశాసనం మీద నేనే సంతకం పెట్టి వచ్చాను’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు చెబుతారు. అది నిజమైనా కాకపోయినా, ఆ తరువాత గవర్నర్ గిరీలు, రాజ్యసభ సభ్యత్వాలకు ఆయన ప్రజాజీవితం పరిమితమై పోయింది. విశాలాంధ్ర ఏర్పాటులో ఆయన దోహదం గురించి అవసరమైనప్పుడు ప్రస్తావనలు చేయడం తప్ప, ప్రభుత్వాలు ఆయనను గుర్తు పెట్టుకున్నదేమీ లేదు. 1990 దశాబ్దం చివరలో ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఒక అప్రధానమైన చోట ప్రతిష్ఠించారు.
తటస్థత అవసరమైన సమయంలో బూర్గుల వలె వ్యవహరించగలగాలని ఇప్పటి నాయకులను ఆశించడం సబబు కాకపోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి పత్రికా సమావేశంలో మాట్లాడిన తీరు ఆయన నిర్వహిస్తున్న పదవికి తగినది కాదని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. ఆయన ప్రజాభిప్రాయాన్నే ప్రతిధ్వనించారని సమర్థకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందరు పౌరులకు వలె ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి కూడా సొంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు ఉన్నది. పదవిలో ఉంటూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలను కలిగి ఉండడం, వాటిని వ్యక్తిగతమైనవిగా పేర్కొంటూ బహిర్గతం చేయడం కూడా సబబైనదే కావచ్చు.
కానీ, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా, తన స్థానాన్ని ఉపయోగించుకుని, పరిణామాలను ప్రభావితం చేయాలనుకోవడం మాత్రం ఒక తటస్థస్థానంలో ఉండవలసిన నాయకుడికి తగినదని చెప్పలేము. రాష్ట్రవిభజన నిర్ణయం పై పునరాలోచించమని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి పత్రంలో తాను సైతం సంతకం చేశానని బహిరంగంగా ప్రకటించి, కిరణ్‌కుమార్ ఒకవైపు కాంగ్రెస్ పెద్దలకు, మరోవైపు విభజన అనుకూల ఉద్యమానికి సవాల్ విసిరారు. తన పదవి హుందాతనాన్ని పణంగా పెట్టి, తన అభిప్రాయ ప్రకటనకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని భావించాలి. ఈ చర్య కిరణ్‌కుమార్‌రెడ్డికి భవిష్యత్తులో సీమాంధ్ర రాజకీయాలలో గట్టి సానుకూల అంశంగా పనిచేయవచ్చు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతాలలో ఉద్యమిస్తున్నవారు కిరణ్‌కుమార్ సాహసాన్ని ఎంతవరకు గుర్తించారో తెలియదు. తాము పదిరోజుల నుంచి వివిధ రూపాలలో బలంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రే పునరుద్ఘాటించినందుకు వారు ధైర్యాన్ని, ఓదార్పును పొంది ఉండవచ్చు. తెలంగాణ నాయకులు మాత్రం ముఖ్యమంత్రికి ఇక ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని అంటున్నారు. ‘నాయకుడే కుట్రదారుడు కారాదు’ అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సరే సరి, కిరణ్ చెప్పిన అంశాలను ఒక్కొక్కటి ఖండించడమే కాకుండా, తెలంగాణవాదంలోని న్యాయాన్ని మరోసారి ఉద్ఘాటించారు. విభజన వల్ల నష్టాలు చెప్పినవాడివి, కలసి ఉంటే తెలంగాణకు కలిగే ఒక్క లాభం గురించి చెప్పలేదేమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటల వెనుక కాంగ్రెస్ అధిష్ఠానమే ఉన్నదని, కిరణ్ మాటల్లో నిజాయితీ లేదని తెలుగుదేశం నేతలు విమర్శలకు దిగారు. మొత్తానికి, కిరణ్‌కుమార్ తన సాహసచర్య ద్వారా విభజన ప్రకటన అనంతర రాజకీయాలను మరింత ఉద్రిక్తం చేశారు, కొత్త చర్చలకు కూడా తెరలేపారు.
సీమాంధ్ర ప్రాంతంలో జనాందోళన తేలికగా తీసిపారేయదగ్గది కాదు. 2009 డిసెంబర్9 ప్రకటన తరువాత ఆ ప్రాంతంలో జరిగిన ఉద్యమం రాజకీయ ప్రేరితమన్న అభిప్రాయం ఉండవచ్చును కానీ, ప్రస్తుత ఉద్యమం రాష్ట్రవిభజన పై సీమాంధ్రప్రజల్లోని భయసందేహాలను ప్రతిఫలిస్తున్నదనే చెప్పాలి. రాజకీయప్రేరణ పాలు తక్కువని, జనం స్వచ్ఛందంగానే వీధుల్లోకి వస్తున్నారని నమ్మడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. అయితే, ఆ స్వచ్ఛందత కారణంగాను, ఒక ఏకీకృత ఉద్యమవ్యవస్థ లేకపోవడం వల్లా ఉద్యమం దిశారహితంగా, విభజన ఆగిపోవాలనే ఒకే ఒక్క డిమాండ్‌ను ప్రకటిస్తూ సాగుతోంది. ఈ ఉద్యమంలో చెప్పుకోదగ్గ సానుకూల అంశం- స్థానిక రాజకీయనేతలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత.
నాయకులు తమ బాధ్యతను నెరవేర్చలేకపోయారన్న ఆగ్రహమే సర్వత్రా తీవ్రంగా కనిపిస్తోంది. నిజానికి ఆ నాయకులకు గాని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయపార్టీలకు గాని రాష్ట్రవిభజన జరిగే అవకాశం ఉన్నదని తెలియకపోలేదు. అంతర్గత చర్చలు జరిపి పార్టీలు తెలంగాణపై వైఖరులు రూపొందించుకుని ప్రకటించాయి. ఇవన్నీ చేస్తూ కూడా, విభజన జరిగే అవకాశం లేదన్న ఆత్మవంచనలో నేతలు ఉండిపోయారా, తమ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారా- అనిపిస్తుంది. హఠాత్తుగా విభజన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్‌కు దాని లెక్కలు దానికి ఉండవచ్చు కానీ, అది ఏ మాత్రం సూచనలేని పరిణామం అనుకోలేము. గత పదమూడేళ్ల కాలంలో మీడియాలోనూ బయటా కొన్ని లక్షల గంటల చర్చలు, కోట్లాది పేజీల పుస్తకాలు, వ్యాసాలు, కొన్ని వేల సమావేశాలూ సభలూ జరిగాయి.
అవన్నీ ప్రజావేదికలపై జరిగిన చర్చలే. నేతలు రాష్ట్రవిభజన జరిగే అవకాశాన్ని గుర్తించి, దాన్ని తమ ప్రజలతో చర్చించి ఉంటే, ప్రాంత ప్రయోజనాల రక్షణకు అనుసరించవలసిన వ్యూహాన్ని, చేయవలసిన బేరసారాలను ముందే సిద్ధపరచుకుని ఉండేవారు. సమైక్యంగా ఉండడం తప్ప మరో మార్గాన్ని మొదటినుంచి నిరాకరిస్తూ ఉండడం వల్ల, విభజన ముంచుకువచ్చేసరికి అగమ్యగోచరస్థితిలోకి వెళ్లిపోయారు. ఏదో అద్భుతం జరిగి, విభజన నిర్ణయం వెనక్కి వెడుతుందన్న అభిప్రాయంలోనే సీమాంధ్ర నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. అందులోనుంచి బయటకు రాకపోతే, తమకు కావలసిందేమిటో చెప్పే అవకాశం కూడా వారికి రాదు.
సీమాంధ్ర ఉద్యమంలో వ్యక్తమవుతున్న భయాల సారాంశం అంతా ఒకటే, నీరు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, చదువులు ఎట్లా? అవి అకారణ భయాలే అయితే, వాటికి నివృత్తి ఏమిటో నేతలకూ తెలుసు, ప్రభుత్వానికీ తెలుసు. తీసుకున్న నిర్ణయాలను కూడా వెనక్కు తిప్పగలిగిన శక్తిశాలురైన నేతలు, రక్షణలు కల్పించడంలో విజయం సాధించలేరా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేయగలిగినవారు తమ సొంత ప్రాంతాన్ని చేయలేరా? లేక, మరేవో ప్రయోజనాలకు జనంలోని అనుమానాలను కవచంగా వాడుకుంటున్నారా? తెలంగాణ సంగతి, హైదరాబాద్ సంగతి పక్కనబెట్టి ఆలోచిస్తే, సీమాంధ్ర ప్రాంతంలో స్థానికమయిన అభివృద్ధిని అలక్ష్యం చేసినందుకు బాధ్యత స్థానిక నేతలే వహించాలి.
సీమాంధ్ర ఉద్యమం ఒక రూపం తీసుకుని, ఇప్పుడు సాధించిన సంఘీభావాన్ని ప్రాంత అభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించేట్టు ఒత్తిడి తెచ్చేలా మలచుకోగలగాలి. అంతే తప్ప, విభజనతోనే సమస్యలు ప్రారంభమవుతున్నట్టు మాట్లాడడం రాజకీయాలు, చరిత్ర తెలియని సాధారణ ప్రజలకైతే చెల్లుతుంది కానీ, కాకలు తీరిన రాజకీయనేతలకు శోభించదు. దురదృష్టవశాత్తూ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగం కూడా అటువంటి ధోరణినే వ్యక్తం చేసి, ప్రజల్లో నిర్హేతుకమైన ఆందోళనలకు మద్దతు పలికింది. దేశంలో జరిగిన ఏ రాష్ట్రవిభజనను చూసినా, రాష్ట్రాల మధ్య పంపకాల గురించిన ఆందోళనలు అనవసరమని, ముందే ఏర్పడిన, సంప్రదాయాలు, విధివిధానాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఎవరికీ అన్యాయం జరగదనీ అర్థమవుతుంది.
పంపకాల్లో న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నపై ఇప్పుడు చర్చ జరుగుతోంది కానీ, ఇంతకాలం పంచుకోవడం న్యాయంగా జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అవగాహన లోపిస్తోంది. పెద్దమనుషుల ఒప్పందమే అమలుజరిగి ఉంటే, నేటి పెద్ద సంక్షోభం వచ్చేది కాదు కదా? పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకువచ్చిన నాయకులు ఇకనైనా సమస్త ప్రజాశ్రేణులకు, ప్రాంతాలకు న్యాయం చేసే సుగుణాన్ని అలవరచుకునేట్టు ప్రజలే బుద్ధిచెప్పాలి. తెలంగాణ ఉద్యమం ఆ క్రమంలో ఎంతో సాధించింది. సీమాంధ్ర ఉద్యమం కూడా. తన వాస్తవ ప్రయోజనాలెక్కడ ఉన్నాయో సమీక్షించుకుని పరిణతిని తెచ్చుకుని వాస్తవమైన డిమాండ్లతో ముందుకు సాగాలి.
[ఆంధ్రజ్యోతి సౌజన్యంతో]