mt_logo

వివక్ష నిజమని కిరణ్ మాటలు రుజువుచేస్తున్నాయి

– కొణతం దిలీప్

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా నష్టపోయిందని ఎంతో కాలంగా తెలంగాణ ఉద్యమకారులు చెపుతున్న మాట అక్షరసత్యం అని నిన్న కిరణ్ కుమార్ రెడ్డి పత్రికా సమావేశంతో మరోసారి నిరూపణ అయ్యింది.

గత కొన్నేళ్లుగా తెలంగాణలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినదని మనం చెబుతూ వస్తుంటే, అలాంటిదేమీ జరగలేదని ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోంది. ఇక కొంతమంది కుహానా సమక్యవాదులైతే విద్యుత్ రంగంలో తెలంగాణకు ఏ అన్యాయం జరగలేదని, ఈ ప్రాంతం విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్ర ప్రాంతం కంటే మెరుగుగా ఉన్నదని పచ్చి అబద్ధాలు ఆడారు.

కానీ ఇప్పుడు సాక్షాత్తూ కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, ఇక్కడి డిమాండ్ కన్నా తక్కువ ఉన్నదని నిజం కక్కాడు.

దేశంలో నే అతిపెద్ద బొగ్గు నిక్షేపాల్లో ఒకటైన సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉండి కూడా తెలంగాణకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో జవాబు చెప్పాలె కిరణ్ ఇప్పుడు. తెలంగాణను తాము ఎంతో అభివృద్ధి చేశామని ఇన్నిరోజులు బుకాయించిన సీమాంధ్ర నేతలు, మరిప్పుడు అంత అభివృద్ధిచేస్తే తెలంగాణకు ఇంత విద్యుత్ కొరత ఎట్లా వచ్చిందో చెప్పాలె.

తెలంగాణలో విద్యుత్ డిమాండు ఎక్కువ ఉందని తెలిసీ ఈ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పకుండా సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్ల్యక్ష్యం చేశారని కిరణ్ మాటలతో ఇప్పుడు మరోసారి నిరూపణ అవుతుంది.

పుండు మీద కారం చల్లినట్టు, విద్యుత్ డిమాండ్ లేకున్నా, ఒక్క బొగ్గు పెళ్ళ కూడా లభ్యం కాని ఆంధ్ర ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. విజయవాడలో వీటీపీఎస్, కడపలో ఆర్టీపీఎస్ నెలకొల్పి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు.

పై ప్లాంట్లకు తెలంగాణ నుండి బొగ్గు రవాణా చేయాల్సి రావడం వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడు అవుతుంది. మళ్లీ ఆ విద్యుత్ ను తెలంగాణకు సరఫరా చేయడం వల్ల ఈ ఖర్చు ఇంకా ఎక్కువ అవుతోంది.

బొగ్గు నిక్షేపాల సమీపంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం అనేది ఆనవాయితీ. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో కాకుండా ఆంధ్ర ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పారు.

ఆంధ్ర ప్రాంతంలో ఈ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పడం వెనుక కనిపించే స్పష్టమైన కారణం సదరు కేంద్రాల్లో ఉద్యోగాలు కొట్టేయడమే. ఆంధ్ర ప్రాంతంలో నెలకొల్పిన విద్యుత్కేంద్రాల వల్ల తెలంగాణ ప్రాంతం సుమారు 4000 ఉద్యోగాలు కోల్పోయింది. ఈనాటి జీతాల ప్రకారం, ఈ ఉద్యోగాలు కోల్పోవడం ద్వారా తెలంగాణ ప్రాంతం నెలకు 8 కోట్ల రూపాయల వంతున సాలీనా సుమారు వంద కోట్ల రూపాయలు కోల్పోయినట్టు.

ఇప్పుడు కిరణ్ మాటలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయం మరోసారి నిరూపిస్తున్నాయి. ఇంత అన్యాయం చేసి తగుదునమ్మా అని సమైక్యంగా ఉందాం అని అనడం సీమాంధ్ర నాయకత్వపు దోపిడీ స్వభావానికి అద్దం పడుతుంది.

తెలంగాణకు 200 ఏళ్లు సరిపోయే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించుకుని, చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కిరణ్ లాంటి నాయకులు ఎన్ని అపశకునాలు పలికినా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో సాగడం ఖాయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *