పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని, పాత జీవోల ఆధారంగానే తాము ఈ ప్రాజెక్టులను చేపట్టామని, గతంలో అనుమతించిన ప్రాజెక్టులకు ప్రస్తుత అవసరాల మేరకు స్వల్ప మార్పులు చేశామే తప్ప కొత్తగా చేపడుతున్నవి కావని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ కు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం సుమారు గంటన్నరపాటు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వలసల జిల్లాగా పాలమూరు, ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ జిల్లా అందరికీ సుపరిచితమేనని, ఈ జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపడితే ఏపీ ప్రభుత్వం, మంత్రులు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్ కు సీఎం వివరించారు.
గతంలోని డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) కోసం నిధులు మంజూరు చేశారని, అప్పట్లో నల్గొండ జిల్లాకు చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నేత స్వయంగా ఒక డీపీఆర్ ను అప్పటి ముఖ్యమంత్రికి అందించిన విషయాన్ని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లోనే డీపీఆర్ లు పూర్తయినా, వాటి అమలును పట్టించుకోలేదని, వాటినే ప్రస్తుతం తాము చేపట్టి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారని తెలిసింది.