పేదల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా రక్కసిని రాష్ట్రం నుండి పారదోలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నూతన అబ్కారీ విధానంపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నూతన ఎక్సైజ్ విధానంలో గుడుంబా, కల్తీ మద్యం నివారణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం పీడీ యాక్ట్ లేదా అంతకు మించిన కఠిన చట్టాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తాను అన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు వరంగల్ తో పాటు ప్రతిచోటా గుడుంబా వల్ల జరుగుతున్న అనర్ధాలను ప్రజలు ఆవేదనతో తెలిపారని, మహిళలైతే గుడుంబాను అరికట్టి తమ కాపురాలు నిలబెట్టాలని అర్ధించారని అన్నారు.
గిరిజన తండాల్లో 20 నుండి 25 ఏళ్ల లోపే యువకులు మృత్యువాత పడుతున్నారని, పారాణి ఆరకముందే యువతులు వితంతువులుగా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆసరా, సబ్సిడీ బియ్యం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా గుడుంబా మహమ్మారి వల్ల వారి బతుకుల్లో విషాదం పోవడం లేదని, ఆడబిడ్డల ముఖంలో చిరునవ్వులు చూడాలంటే గుడుంబా దరిద్రాన్ని పారదోలాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన మద్యం పాలసీ ఉండాలని సూచించారు. విదేశాలనుండి పెట్టుబడిదారులు, పర్యాటకులు తదితరులు వస్తారని, ఇలాంటి చోట నకిలీ మద్యం లాంటివి చోటుచేసుకుంటే నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని సీఎం అన్నారు.
సీఎంతో సమీక్ష అనంతరం విలేకరులతో ఎక్సైజ్ శాఖామంత్రి పద్మారావు మాట్లాడారు. ప్రజలనుండి విమర్శలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా నూతన మద్యం విధానం రూపొందిస్తామని, గుడుంబాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ తదితరులు పాల్గొన్నారు.