పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. నిజామాబాద్ లో పెర్కిట్‌లోని అరవింద్ ఇంటి ముందు మంగళవారం ఉదయం వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు..పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాము కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనిపించే బాధ్యతను ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీజేపీ నాయకులు రైతుల నుంచి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు.
అబద్ధపు హామీలతో రైతులను మభ్యపెట్టాలని చూస్తే రైతుల నుంచి ఎదురు దెబ్బ తగులుతుందని మరోసారి ఎంపీ అరవింద్ విషయంలో రుజువైంది. మొదటిసారిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేయగా… ఇపుడు అరవింద్ ఏ ఊరికి వెళ్లినా.. అడుగడుగునా పసుపు రైతుల నిరసనలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన ఏ ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక యాసంగిలో వరి ధాన్యం వేయండి.. ప్రతి గింజ కొంటామని చెప్పి రైతులను తప్పుదోవ పట్టించారు. ఈ క్రమంలో చైతన్యవంతులైన నిజామాబాద్, ఆర్మూర్ రైతులు శాంతియుతంగా ఎంపీ అరవింద్ గారి ఇంటిని ముట్టడించారు. వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఎంపీ అరవింద్ ఇంటి ముందు కుప్పలుగా పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.