ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ జారీచేసి తప్పు చేసిందని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఎంసెట్ ను నిర్వహిస్తున్నామని విద్యాశాఖామంత్రి జీ జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ పరీక్ష విధివిధానాలను గవర్నర్ కు వివరించేందుకు ఆయన శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్ళారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఎంసెట్ షెడ్యూల్ ను ఏకపక్షంగా విడుదల చేసిన విషయాన్ని గవర్నర్ కు వివరించామన్నారు. విభజన చట్టం సెక్షన్ 75 ప్రకారం తెలంగాణ ఎంసెట్ నిర్వహించుకుంటున్నామని, ఏపీ అధికారులకు కూడా ప్రవేశాల కమిటీలలో సభ్యులుగా భాగస్వామ్యం కల్పించామని చెప్పామన్నారు.
పాత పద్ధతిలోనే 15 శాతం ఉమ్మడి అడ్మిషన్లకు తాము కట్టుబడి ఉన్నామని, ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించబోమని, ఏపీ ప్రభుత్వం కోరితే వారి ఎంసెట్ నిర్వహణకు కూడా తాము సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఎంసెట్ నిర్వహించుకోవడానికి ఎందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందో వివరించగా గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, గొడవలు లేకుండా సాఫీగా ప్రవేశాలు నిర్వహించుకోవాలని, ఏదైనా సమస్య వస్తే ఇద్దరు మంత్రులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.