ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొననున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులనుండి పార్టీ విజయావకాశాలపై కేసీఆర్ సమాచారం సేకరించనున్నారు. 119 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు మొదటిసారి పోటీ చేసినా ప్రజల వద్దనుండి వచ్చిన ప్రజాదరణను, మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో లభించే విజయావకాశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాతో ఉన్న పార్టీ నేతలు అధినేతతో సమాలోచనలు జరపనున్నారు. ఈనెల 12,13 తేదీల్లో స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో వాటికి సంబంధించిన అన్ని అంశాలనూ చర్చించనున్నారని తెలిసింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినందున, ఉద్యోగులకు అన్యాయం జరగకుండా అడ్డుకోవడానికి తీసుకునే చర్యలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.