తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇన్నేళ్ళూ సీమాంధ్రుల పాలనలో వివక్షకు, అవమానాలకు గురైన తెలంగాణ ఇప్పుడు నవతెలంగాణ రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ 294 మంది సభ్యులతో కిటకిటలాడే అసెంబ్లీ ఇప్పుడు 119మంది సభ్యులతో విశాలంగా కనిపించింది. సభ ఉదయం 11గంటలకు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం దాదాపు 2 గంటలపాటు కొనసాగింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటించారు. సభ ముగియగానే స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి నామినేషన్ వేశారు. వేరే ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో మధుసూదనాచారి ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి ఎన్నికను జానారెడ్డి మంగళవారం అధికారికంగా ప్రకటిస్తారు.