mt_logo

ఇది ఫుడ్ ఫాసిజం!

By: విశ్వరూప్

ఉస్మానియాలో దళిత, బహుజన విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఏబీవీపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలూ ఘర్షణ పడగా పోలీసులు లాఠీచార్జీ, భాష్పవాయుప్రయోగం చేయాల్సివచ్చింది. గత సంవత్సరం కూడా దళిత విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ చేసినప్పుడు రైట్‌వింగ్ వారు అడ్డుకుని ఆహారంలో మూత్రవిసర్జన జరిపినట్లు సమాచారం. కాగా ఈసారి దళితులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ వారి ఫెస్టివల్ ఉద్రిక్తతుకు దారితీసింది.

దళితులకు ఎద్దుమాంసం ఒక డెలికసీ. ఎద్దు, దున్నపోతు మాంసాలు వారు ఇష్టంగా తింటారు. వందల సంవత్సరాలనుంచీ ఇతర సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్టు బతుకు కొనసాగించిన దళితులు ఊర్లో ఎవరింట్లోనైనా గొడ్లు చనిపోతే వాటిని తీసుకెల్లి కోసి మాంసం తిని చర్మంతో చెప్పులు తయారుచేసేవారు. మున్సిపాలిటీ లాంటి వ్యవస్థలు లేని ఆకాలంలో వీరు చచ్చిన గొడ్లను తీసుకెల్లి మిగతా సమాజానికి చచ్చిన గొడ్లు కుళ్లిపోయి వ్యాధులు వ్యాపించకుండా సేవ చేశారు. ఇప్పుడు వారు గొడ్డుమాంసం తినడం ద్వారా తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని రైట్ వింగ్ అభిప్రాయం. ఈ మొత్తం పరిణామం అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

గొడ్డు మాంసం తినడాన్ని అడ్డుకుంటున్న వారిలో అనేకులు గొర్రె, మేక మాంసం తినేవారే. రేపెవరయినా వచ్చి గొర్రె, మేక వారికి తల్లి లాంటివి, దేవతలతో సమానం కనుక ఎవరయినా వాటి మాంసం తింటే తమ మనోభిప్రాయాలు దెబ్బతింటాయి అని చెబితే ఎంతమంది తినడం మానేస్తారు? ఇప్పుడు అడ్డుకున్న వారిలో అనేకులు రేప్పొద్దున విదేశాలకెల్తారు. అక్కడ ఆఫీసు క్యాంటీనులో తమపక్కనే కూర్చొని తెల్లొల్లు గొడ్డుమాంసం తింటుంటే వీల్లమనోభావాలు దెబ్బ తినవా? దెబ్బతింటే తెల్లొల్లకు గొడ్డుమాంసం తినొద్దని వీరు అడ్డు చెబుతారా?

అంటే గొడ్డుమాంసం తినే దళితులు తమకంటే తక్కువవారు కనుక వారి హక్కులకు భంగం కలిగించొచ్చు.ఏమయినా అంటే మామనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. తెల్లోడు మనకన్న బలవంతుడు, ఎక్కువమాట్లాడితే ఎగిరి తన్నుతాడు కనుక తెల్లోడు పక్కన కూర్చొని గొడ్డుమాంసం లాగిస్తున్నా నోర్మూసుకుని ఊర్కుంటారు. మేకని తింటే తమ మనోభావాలు దెబ్బతింటాయని ఎవరైనా చెబితే ముందు ఎదుటివారి బలం ఎంత అని చూసి, బలవంతుడయితే ఆపేస్తారు, బలహీనుడయితే పట్టించుకోరన్నమాట!!

అసలు దలితులు బీఫ్ ఫెస్టివల్లో తినేది, మన రాష్ట్రంలో దొరికేది ఆవు మాంసం కాదు, ఎద్దు, బర్రె, లేదా దున్నపోతు మాంసం. తినేది ఆవు మాంసం కానేకానప్పుడు ఎవరి మనోభావాలు మాత్రం ఎందుకు గాయపడాలి? ఎద్దు మాంసంతో బూట్లు చేస్తే చక్కగా కొనుక్కుని తొడుక్కున్నప్పుడు ఎద్దుమాంసం తింటే మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? వీల్లనెవ్వరూ తినమనలేదే? పక్కవారు తింటూంటే ఎవరికి మాత్రం ఏం నష్టం? అసలు గొడ్డు మాంసం తినగూడదు, మేక, గొర్రెలను తినొచ్చని ఏ మతగ్రంధం చెప్పింది?

అసలు నిజానికి హిందువులు గొడ్డుమాంసం తినకపోవడానికి మతంతో సంబంధం లేదు. వ్యవసాయ ప్రధానమయిన దేశంలో పశువులు సాధారణంగాప్రజలకు, ముఖ్యంగా రైతులకు పెంపుడు జంతువులలాంటివి. పెంపుడు జంతువులను తినడానికి మనసొప్పదు కనుక గొడ్డుమాంసం తినడం మానేశారు అనేది ఒక థీరీ కాగా, పశుసంపద తగ్గిపోగూడదనే ఉద్దేశంతో గొడ్డుమాంసం తినడం మానేశారనేది మరొక వాదన. ఇప్పుడు కొత్తగా ఆరెస్సెస్ దీన్ని మతానికి లింకు పెట్టి తినొద్దని శాసిస్తే వేల సంవత్సరాలనుండి గొడ్డుమాంసాన్ని ఇష్టంగా తింటున్న దళితులు ఇప్పుడెందుకు మానెయ్యాలి?

బీజేపీ, ఆరెస్సెస్ ల ఫాసిస్టు పోకడలవల్ల తెలంగాణలో ఎప్పుడో ఈపార్టీకి ప్రజలు పాతరేశారు. ఇప్పుడు తెలంగాణవాదంవల్ల మహబూబ్‌నగర్లో గెలిచిన బీజేపీ ఇది తమ సొంత బలమనుకుని మళ్లీ ఫాసిస్టు పోకడలకు పోతే నష్టపోయేది వీరే. మతవిశ్వాసాలు, భొజనపు అలవాట్లూ మనుషుల వ్యక్తిగత విషయాలు, వీటిపై ఎవ్వరూ మరొకరిని శాసించలేరని బీజేపీ ఇకనయినా తెలుసుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *