mt_logo

కారం మెతుకులు మిగిలాయి!

– తెలంగాణ కోసం తండ్రి ఆత్మహత్య
– బిడ్డలను వదిలి కూలికి పోతున్న తల్లి
– అర్ధాకలితో.. కష్టాల ఒడికి కుటుంబం
– కైలాసం ఆత్మహత్య.. భవిష్యత్తును చిదిమింది
– ఇది అమర వీరుడి భార్య కన్నీటి గాథ

ఫొటోలో కనిపిస్తున్నది లలిత. ఆ ఇద్దరూ ఆమె పిల్లలు. పదినెలల పసిగుడ్డుకు ఏమీ తెలియదు. తండ్రి చనిపోయిండని మూడేళ్ల కొడుకు శివకు తెలుసు. కానీ.. ఎందుకు చనిపోయిండో తెలియదు. ఊళ్లో ఎక్కడ పాడె లేచినా.. అది నాన్నదే అనుకునే అమాయకత్వం. ఆ నాన్నపేరు తోడేటి కైలాసం. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన సాధారణ మేస్త్రీ. కానీ.. ఇది కైలాసం త్యాగంపై కథనం కాదు! కైలాసం ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కుటుంబం అతలాకుతలమై.. అతడి ఇద్దరు పిల్లలు ఆకలికి నకనకలా డుతున్న దీనగాథ! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. కొన్నాళ్లకే త్యాగం పేరుతో తనను కష్టాల ఒడిలోకి నెడితే.. ఆదుకునే వాళ్లు లేక.. బిడ్డలను సాదుకునే మార్గం తెలియక జీవిత నడిసంద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓ అభాగ్యురాలి విషాద గీతం! పదినెలల పసిగుడ్డును తాత దగ్గర విడిచి, మూడేళ్ల కొడుకును బాల్వాడీకి పంపి.. తాను కూలి పనులకు పోతున్న లలిత కంటిలో ఇక ఏడవటానికి లేకుండా ఇంకిపోయిన కన్నీళ్ల కథ! పసిపిల్లలు ఉన్నారన్న యాది లేకుండా.. వారి భవిష్యత్తును గాలికి వదిలేసి కైలాసం తన ప్రాణాన్ని తెలంగాణ కోసం నైవేద్యంగా పెడితే.. దాని ఫలితంగా పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం ఇప్పుడు కారం మెతుకులతో అర్ధాకలితో గడుపుతున్న హృదయ విదారక సన్నివేశం! తెలంగాణ కోసం కొట్లాడండి.. కానీ.. నాలాంటి వాళ్లకు కన్నీళ్లు మిగిల్చికాదు.. అంటున్నది 21 ఏళ్ల వయసులోనే బతుకు భారమైన లలిత! ఆలకిస్తున్నారా ఆ మాట!

ఇది లలిత కథ!

నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కైలాసం భార్య. వృత్తిరీత్యా కైలాసం మేస్త్రీ. నాలుగేళ్ల కిత్రం ఇద్దరూ మనసుపడ్డారు. మనువాడారు. వారికి ఆస్తులు లేవు. అప్పులూ లేవు. కష్టాల్లో ఉన్నా.. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నారు. ఇద్దరు బిడ్డలు కలిగారు. సంసారం సాఫీగా జరుగుతున్నది. ఏనాడూ ఇద్దరూ ఒక్కమాట అనుకున్నది లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మరి! పిల్లలన్నా అంతే మమకారం! స్వతహాగానే బలమైన తెలంగాణవాది అయిన కైలాసం.. ఉద్యమంలో చురుగ్గా ఉండేవాడు. నిరాహారదీక్షల్లోనూ పాల్గొన్నాడు. ఇదే సమయంలో తెలంగాణ విషయంలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తేగానీ తనలాంటివారి బతుకులు మారవని అనుకున్నాడు. తన మరణం సీమాంధ్ర పాలకులకు కనువిప్పు కల్గిస్తుందని భ్రమపడ్డాడు. సీమాంవూధులు తెలంగాణను రానివ్వరని లేఖలో రాసి ఊరవతల హైటెన్షన్ స్తంభానికి ఉరేసుకొని చనిపోయాడు. ఆయన మరణం సీమాంధ్ర పాలకులను కదలించలేక పోయింది. తెలంగాణలోని ద్రోహుల్లో కాపట్యాన్ని తొలగించలేక పోయింది. కానీ.. పచ్చని సంసారంలో నిప్పుపెట్టింది. కుటుంబాన్ని ఆగమాగం చేసింది.

అప్పటిదాకా తండ్రి తెచ్చిపెడితే.. తల్లి వండిపెడితే కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయిన చిన్నారులు.. ఇప్పుడు అన్నం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. కుటుంబానికి పచ్చికారం మెతుకులు తిని బతకాల్సిన దౌర్భాగ్యం. గత ఏడాది జూలై 21న కైలాసం చనిపోయే నాటికి కొడుకు శివకు రెండేళ్లు. కూతురు పుట్టి అప్పటికి 14వ రోజు. అంత్యక్షికియలకూ డబ్బుల్లేవు. చావుకొచ్చినోళ్లు అంతోఇంతో సాయం చేస్తేగానీ పాడెలేవలేదు. మరుసటి రోజు నుంచే లలితకు జీవనపోరాటం మొదలైంది. పచ్చిబాలింతరాలు.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పాలుతాగే పాపాయిని స్కూలు వరండాలో పడుకోబెట్టి, కొడుకును బాల్వాడీలో వదిలి.. కూలికి వెళ్లింది. ఇప్పటికీ రోజువారి ఇదే తీరు. కైలాసం తల్లిదంవూడులు చనిపోయారు. లలిత తల్లి కూడా చనిపోయింది.

లలిత తండ్రి చీరాల ఎల్లయ్యే ఆ కుటుంబానికి ఇప్పుడు అండ. ఎల్లయ్య ప్రభుత్వ పాఠశాలలో అటెండర్. స్కూలు పిల్లలకే కాదు.. లలిత బిడ్డకు కూడా! అతని కొచ్చే కిలోలు, లలితకొచ్చే 12 కిలోల బియ్యమే వారి నెలసరి గాసం. ఎల్లయ్య మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేస్తాడు. లలిత కొడుకు శివ బాల్వాడీలో మధ్యాహ్న భోజనంతో కడుపు నింపుకుంటాడు. లలిత కూలి డబ్బులే వారికి జీవనాధారం. పని కూడా రోజూ దొరకదు. దొరికిన రోజు దాచుకుం రేపటి ఖర్చు. కైలాసం మరణమే పట్టని సీమాంధ్ర పాలకులకు అతడి కుటుంబం గురించి ఏం పట్టించుకుంటారు? రాజకీయ నాయకులూ ఇప్పుడు కనిపించడం లేదు.

కాలమెట్ల గడుస్తదో తెలువదు

“‘నా భర్త నన్ను ఆగం చేసి పోయిండు. ఇద్దరు పసిబిడ్డల మీదనన్న అతనికి మనసు గుంజలేనట్లుంది. మా బతుకులు ఆగమయినయి. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నడు. ఏనాడు పల్లెత్తు మాటనలేదు. ఉన్న దాంట్లో సర్దుకొని బతికినం. ఇంతపని చేస్తడనుకోలేదు. నాకు బిడ్డ పుట్టిన 14 రోజులకే ఆయన చనిపోయిండు. అప్పటినుంచి ఇంట్లో సంతోషం లేదు. ఇప్పటికీ నా బిడ్డకు పేరు పెట్టలేదు. పెట్టే దిక్కులేరు. నేను బాలింతగా ఉంటే ఆయనే రోజు వంట చేసి తన సద్ది కట్టుకొని నాకు ఉంచి పనికి పోయేవాడు. ఏనాడూ నాకు తనలో బాధను తెల్వనియ్యలే. ఆయన చనిపోయేనాటికి నా కొడుకుకు రెండేళ్లు. తన తండ్రి చావును చూసిన జ్ఞాపకంతో ఇప్పటికీ ఊళ్లో ఎవరు చనిపోయినా ‘నాన్నను తీస్కపోతుండ్రు.. డాడీని పొక్కతీసి పొక్కలో పెడ్తరు’ అంటుండు. ఇంట్లో ఆయన ఫొటో కూడా లేదు. ఉన్నవన్నీ పత్రికలోల్లు, పెద్దమనుషులు తీసుకపోయిండ్రు. వాళ్లువీళ్లిచ్చిన రూ.3వేలతో చావుఖర్చులు చేసిన. నాబిడ్డను మా నాయిన దగ్గర ఉంచి పనికి పోతున్నా. పని రోజు దొరకదు. దొరికితే రూ.70-100వరకు మాత్రమే వస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి చేతుపూత్తి మొక్కుతున్నా. మీ మీద ఆధారపడినోళ్లకు నాలాగా కన్నీటిని మిగల్చొద్దు”

– లలిత, కైలాసం భార్య

నా బిడ్డకు తీరని కష్టమొచ్చింది

“నాబిడ్డకు చిన్నవయసులోనే తీరని కష్టమొచ్చింది. మేము నిరుపేదలం. కైలాసానిది మాది ఒకే కులం కావడంతో ప్రేమించుకున్నమంటే పెళ్లి చేసిన. మా అల్లుడు మంచోడుండె. ఏనాడు బాధపెట్టెటోడు కాదు. ఏ పండుగొచ్చినా నన్ను పిలుచుకొని కూర తెచ్చి తినపంపెటోడు. నేను బడిలో అటెండర్‌గా పనిచేస్తున్నా. నాకు రూ.1600ల జీతమిస్తరు. నా కొడుకు తుర్కపల్లిలో బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటుండు. నేను నా బిడ్డతాన్నే ఉండి, వచ్చిన దాంట్లో కొడుకును చదివిస్తూ బిడ్డకు సాయంచేస్తున్నా. నా బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి. దాతలు కరుణించి ఆమె పిల్లలకు సాయం చేయాలె. నా తర్వాత ఆమె బతుకు ఎట్లుంటదో తలుచుకుంటే బాధగా ఉంది”

– చీరాల ఎల్లయ్య, లలిత తండ్రి

By: (యాతాలం చిన్నారెడ్డి, బోరెడ్డి సంతోష్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి: నమస్తే తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *