ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అన్ని దారులూ మూసుకుపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని తెరపైకి తేవడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఒత్తిడితో కేంద్రం సెక్షన్-8 ను విధించాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ మేధావులు, పలువురు నేతలు, వివిధ సంఘాల నాయకులు కేసీఆర్ కు తెలిపారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు సైతం పిలుపునివ్వాలని, దీనిపై వ్యతిరేకంగా ఢిల్లీలో నిరాహారదీక్ష చేద్దామని సీఎంను కోరగా కేంద్రం వ్యవహరించే తీరును బట్టి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ వారికి సూచించారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ సెక్షన్-8 అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. సెక్షన్-8 పరిధి చాలా చిన్నది.. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.. కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన చర్యలు ఉంటాయని కోదండరాం పేర్కొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నమని, నీతిమాలిన రాజకీయాల నుండి బయటపడేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు పోతే మరోసారి పరువు పోవడం ఖాయమని అన్నారు.
ఇదిలావుండగా సీఎం కేసీఆర్ కు వివిధ రాష్ట్రాల మంత్రులు, పలువురు ఢిల్లీ నేతలు ఫోన్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8 ను విధిస్తూ హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యపై తామంతా మీతో కలిసి వస్తామని, మేమంతా మీతోనే ఉంటామని వారు సీఎం కేసీఆర్ కు తెలిపారు.