mt_logo

సెక్షన్-8 దొంగల కాపలా కోసమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి

నేరస్థుల రక్షణకు చట్టోల్లంఘన:

ఆంధ్ర నాయకత్వం శక్తియుక్తులు ఎంతగొప్పవయినా కావచ్చు. ఒక అవినీతి రాజకీయ వేత్తను కాపాడడానికి మొత్తం వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి కొసరు విషయాన్ని ఎజెండాలోకి తెచ్చి దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేయవచ్చు. నేరమే అధికారమై దొంగతనానికి రక్షణలు కోరవచ్చు, కల్పించనూ వచ్చు. కానీ రాజ్యాంగాన్ని వక్రీకరించేంత గొప్పవి కాదు. ఇవ్వాళకాకపోతే రేపయినా అందరూ రాజ్యాంగం ముందు తలవంచాల్సిందే. ఆంధ్ర నాయకత్వం శీర్షాసనాలు వేయవచ్చుగాక రాజ్యాంగం ప్రకారం సెక్షన్ 8 చెల్లదు. సెక్షన్ 8 కింద గవర్నర్‌కు దాఖలు పర్చిన అధికారాలు రాజ్యాంగానికి లోబడి ఉపయోగించాల్సినవే తప్ప, వాటిని గవర్నర్ స్వేచ్ఛగా ఉపయోగించే వీలు లేదు. సెక్షన్ 8 రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయకూడదనే పోలీసు అధికారాలను తెలంగాణకే చెందుతాయని పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకోవడానికి, అది కూడా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మాత్రమే వ్యవహరించడానికి సెక్షన్ 8. ఎందుకంటే-

1. రాజ్యాంగం ఏడవ షెడ్యూలులో పేర్కొన్న జాబితాల ప్రకారం శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్రాల అధికారాల పరిధిలోనివి. దానిని అతిక్రమించే ప్రత్యేక నియమాలేవీ విభజన చట్టంలో కల్పించలేదు.

2. పునర్విభజన చట్టం రెండు రాష్ట్రాల సరిహద్దులు, అధికారాల పరిధులు నిర్ణయించింది. చట్టంలోని సెక్షను 3 నుంచి 5 వరకు ఏ ప్రాంతం, ఏ జిల్లా ఏ రాష్ట్రం కిందికి వస్తాయో నిర్ణయించింది. పోలీసు, రెవెన్యూ, ఇతరత్రా ఏ అధికారాలయినా సరిహద్దులకు లోబడి సంక్రమించేవే. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం వేలుపెట్టే అధికారమేదీ కేంద్రానికిగానీ, గవర్నర్‌కు గానీ విభజన చట్టం, రాజ్యాంగం కల్పించలేదు.

3. రాష్ట్రాల సరిహద్దులు ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రం అధికారాల్లో మరో రాష్ట్రానికి అధికారం కల్పించే నిబంధన, వెసులుబాటు రాజ్యాంగంలో లేదు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11 చదవండి:

విభజన చట్టం పార్టు-1లో పైన పేర్కొన్న ఏ నిబంధనలూ రాష్ట్రం పేరు, విస్తరణ, జిల్లాలు, సరిహద్దుల మార్పులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారాలపై ఎటువంటి ప్రభావం చూపించవు. అంటే కొత్తగా ఒక రాష్ట్రం అధికారాల్లో మరో రాష్ట్రానికి అధికారం కల్పించే ఎటువంటి మార్పులనూ చట్టం అనుమతించడం లేదు.

4. సెక్షను 8ని కూడా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉపయోగించే వీలు లేదు. రెండు రాష్ట్రాల పోలీసులు ఉమ్మడి రాజధాని నుంచి పనిచేస్తాయని అటార్నీ జనరల్ అన్నట్టు ఒక కథ పుట్టించారు. పునర్విభజన చట్టం చదువుకున్నవారికి ఎవరికయినా మెడమీద తలకాయ ఉన్న వారెవరికయినా అర్థం అవుతుంది. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల వారి ఆస్తులు, మానప్రాణాలకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైనప్పుడు గవర్నర్ తెలంగాణ మంత్రి మండలితో సంప్రదించి మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుందని సెక్షను 8(3)లో ఉంది. ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తావనగానీ, ఆంధ్ర పోలీసుల ప్రస్తావనగానీ చట్టంలో లేదు. అంతేకాదు గవర్నర్ తెలంగాణ పోలీసులను నేరుగా ఆదేశించే అధికారాలేవీ లేవు. ఒక దొంగను విడిపించమని గానీ లేక అరెస్టు చేయమనిగానీ ఒక కానిస్టేబుల్‌ను నేరుగా ఆదేశించే అధికారాలేవీ గవర్నర్‌కు లేవు. ఇక రెండు రాష్ట్రాల పోలీసుల ప్రస్తావన ఎక్కడ ఉంది.

5. గవర్నర్‌కు హైదరాబాద్ శాంతి భద్రతల అధికారాలు అప్పగించాలన్న యోచనను బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడే అప్పటి ప్రతిపక్షనాయకుడు, ప్రముఖ న్యాయనిపుణుడు, ఇప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా వ్యతిరేకించారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, రాజ్యాంగ సవరణ చేయకుండా గవర్నర్‌కు అధికారాలు అప్పగించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అప్పుడు తప్పయింది ఇప్పుడు ఒప్పెలా అవుతుందో బీజేపీ నాయకత్వం చెప్పాలి.

6. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించడమే తెలంగాణ నేతలు చేసిన తప్పిదంగా కనిపిస్తున్నది. ఒకనాడు మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ అన్నట్టు ఆంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్‌ను గెట్‌లాస్ట్ అని ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదేమో. ఆంధ్ర నాయకత్వం తెలివితేటలను రాజాజీ గుర్తించినట్టుగా తెలంగాణ నాయకత్వం గుర్తించలేదేమో. విభజన తర్వాత ఒక్క క్షణం కూడా వారితో కలిసి ఉండడానికి మద్రాసు రాష్ట్రం ఇష్టపడలేదు.

7. ఆ నరేంద్రుడే(వివేకానందుడే) ఈ నరేంద్రుడ(నరేంద్రమోడీ)ని చంద్రబాబు పొగిడినప్పుడే తెరవెనుక ఏదో జరుగుతోందని అనిపించింది. లాబీయింగ్‌లో చంద్రబాబు, ఆంధ్ర నాయకత్వం ఇప్పటికీ తెలంగాణ కంటే శక్తివంతమయినదని చెప్పడంలో ఎవరికీ సందేహం లేదు. వారికి అన్ని వ్యవస్థల్లో ఏజెంట్లు, జీతగాళ్లు ఉన్నారు. కానీ ఒక నేరాన్ని, ఒక నేరస్థుడిని కాపాడడానికి కేంద్రం, బీజేపీ, అన్ని వ్యవస్థలు పూనుకుని పనిచేస్తుండడమే ఆశ్చర్యం వేస్తున్నది. విభజన చట్టాన్ని, రాజ్యాంగాన్ని అన్నింటినీ ఉల్లంఘించడానికి సైతం వెనుకాడకపోవడమే విస్మయం కలిగిస్తున్నది. లక్ష రూపాయల లంచానికి బంగారు లక్ష్మణ్ రాజకీయ జీవితాన్ని బలిపెట్టిన బీజేపీ, ఇప్పుడు ఐదు కోట్లు లంచంగా ఎరచూపిన ఒక నాయకుడిని కాపాడడానికి నిర్లజ్జగా ముందుకువస్తున్నది. బక్కవాడికి ఒక న్యాయం, బలవంతుడికి మరో న్యాయం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అత్యంత హీనమైన నేరంలో దొరికిన చంద్రబాబును దండించకపోగా ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు బాగా లేదని సన్నాయి నొక్కులు నొక్కుతారు.

8. ఇటువంటి నేరంలోనే తెలంగాణ రాష్ట్రసమితిలో ఒక నాయకుడో, ఒక అధికారో దొరికి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఈ పాటికి తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో భూమిలోకి కుంగిపోవలసిన పరిస్థితులను కల్పించి ఉండేవారు. చంద్రబాబులు, ఆయన చెంచాబాబులు, వెంకయ్యలు ఎర్రకోట ఎక్కి నీతిశతకాలు చెబుతూ ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకేర్పడిందిరా అని తెలంగాణ ప్రజలు అనుకునే విధంగా మొత్తం కథను నడిపించేవారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *