రోజుకు పది సభలతో సుడిగాలి పర్యటన చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం వరంగల్ జిల్లా భూపాలపల్లి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ పార్టీలను విలీనం చేస్తేనే రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారా? అని, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలనుండి వస్తున్న ఆదరణ చూసి ఒక్కొక్కరు బట్టలు చింపుకుంటున్నారని, డిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎన్నడూ మాటతప్పలేదని, పార్టీని విలీనం చేస్తానన్న మాట నిజమే కానీ, 2012 సెప్టెంబర్ లో నెలరోజులు డిల్లీలో కాంగ్రెస్ పెద్దలందర్నీ కలిసి తెలంగాణ ఏర్పాటు ఆలస్యం చేయొద్దని, అమాయక పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారని, వెంటనే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పానని వివరించారు. కానీ కాంగ్రెస్ నేతలు తనమాటలు పట్టించుకోకుండా ఒకటిన్నర సంవత్సరాలు ఆలస్యం చేయడం వల్ల వందలమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల సమక్షంలో సమావేశం నిర్వహించి అందరి సలహాలూ, సూచనలు తీసుకున్నతర్వాతే కాంగ్రెస్ పార్టీతో ఇక సంబంధం లేదని, మరే పార్టీతోనూ పొత్తు గానీ, విలీనం ముచ్చట ఉండదని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టదలుచుకోలేదని, డిల్లీకి తాము గులాంగిరి చేసే ప్రసక్తే లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తామే నడిపించుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాసమస్యలు పట్టవని, టీఆర్ఎస్ ను విమర్శించడమే పనా అని కేసీఆర్ మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు ఇంకా మెరుగ్గా అమలుపరుస్తామని, రైతులకు లక్ష లోపు రుణమాఫీ, వృద్ధులకు, వితంతువులకు 1000 రూ.లు, వికలాంగులకు రూ. 1500 పించను అందజేస్తామని, లంబాడీ తండాలు, గిరిజనగూడెంలను గ్రామపంచాయితీలుగా మార్చుతామని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మారుస్తామని, భూపాలపల్లి జిల్లాకు ప్రొ. జయశంకర్ జిల్లాగా నామకరణం చేస్తామని, సింగరేణిలో కొత్తగనులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కడియం శ్రీహరి, మధుసూదనాచారిలను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా గెలిపించాలని కోరారు.