టీడీపీ ఆంధ్రా పార్టీ అని, తెలంగాణలో ఆంధ్రా పార్టీ ఉండే అవకాశమే లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భూపాలపల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మహబూబాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓటువేస్తే మనకు న్యాయం జరగదని, టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు, వెంకయ్యనాయుడు అడ్డుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన తలరాతను మనమే రాసుకుందామని, తెలంగాణ కోసం ఎవరేం చేశారో మానుకోట రాళ్ళకు, మట్టికి తెలుసన్నారు.
ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని, 1948-56మధ్య జరిగిన తప్పులకు 60ఏళ్ళు బాధపడ్డామని, ఎన్నో బాధలు పడితేతప్ప ఆంధ్రప్రదేశ్ నుండి వేరుపడలేకపోయామని, ఆంధ్రోళ్ళతో పంచాయితీ ఇంకా అయిపోలేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడేవాళ్ళు కావాల్నా? ఆంధ్రా వాళ్ళ డబ్బా కొట్టేవాళ్ళు కావాల్నా? అని ప్రశ్నించారు.
అనంతరం తొర్రూరులో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలనూ తూచా తప్పకుండా అమలుపరుస్తామని, 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. 1969 ఉద్యమంలో 400 మంది చనిపోతే, ఇప్పుడు జరిగిన ఈ ఉద్యమంలో 1500మందిదాకా యువకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ ఇదని, వరంగల్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని, జిల్లాలో కంతెనపల్లి, దేవాదుల ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పారు. ఎర్రబెల్లి, దుగ్యాల పచ్చి తెలంగాణ ద్రోహులని, పాలకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. సుధాకర్ రావును, వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరిని గెలిపించాలని పిలుపునిచ్చారు.