mt_logo

జైపాల్ రెడ్డికో బహిరంగ లేఖ!

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి రాజకీయాలలో నువ్వు చూపిన తెగువ గురించి విని ఔరా అనుకున్నాం.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీనే వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని వీడిన గొప్ప ప్రజాస్వామికవాదిగా నిన్ను తలుచుకున్నాం.

అనేక పార్టీలకు అధికార ప్రతినిధిగా ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను అలవోకగా ఎదుర్కొన్న నీ వాగ్ధాటి చూసి అబ్బురపడ్డాం.

శారీరిక వైకల్యాన్ని ఎదిరించి నువ్వు అధిరోహించిన శిఖరాలను ఇతరులకు ఆదర్శంగా చూపించాం.

అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా నిన్ను సత్కరించినప్పుడు ఆ బిరుదుకే ఒక కొత్త శోభ వచ్చిందనుకున్నాం.

నీ జిల్లాను దాటి వచ్చి నల్లగొండలో జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల్లో నిలబడ్డా, ఒక విశిష్ట అతిధిలా నీకు జేజేలు పలికాం.

గెలిచినాక నువ్వు నియోజకవర్గానికి ఏమీ చేయకున్నా, మన వాడు డిల్లీలో చక్రం తిప్పే గొప్పోడులెమ్మని సరిపెట్టుకున్నాం.

పోయినేడాది నువ్వొచ్చి తెలంగాణ గడ్డపై జాతీయవాదం బోధించినప్పుడు, దాని తత్వం అర్థం కాక కలవరపడ్డాం.

కానీ వరుస మోసాలు, కుట్రలకు బలైన మన తెలంగాణ, శక్తినంతా కూడదీసుకుని చివరాఖరుకి ఒక మహా సంగ్రామానికి తెర తీసిన వేళ

నువ్వు ముఖ్యమంత్రి పదవి కొరకు పైరవీలు చేస్తున్నవని విని సిగ్గుపడుతున్నాం

 

ప్రపంచాన్ని చదివిన వాడివి, నీకు చెప్పేంత పెద్దవాళ్లం కాకపోవచ్చు.

కానీ జైపాల్ – ఇవ్వాళ నాలుగు కోట్ల ప్రజల తండ్లాట నీకు కనపడటం లేదా?

ఆరు దశాబ్దాల ప్రజా ఉద్యమ నినాదాలు నీకు వినపడటం లేదా?

భగభగ మంటల్లో మండిపోతున్న మన యువకిషోరాల దేహాల సెగలు నీకు సోకట్లేదా

నిన్ను కన్న గడ్డ కౄర నిర్భందం కింద నలిగిపోతుంటే నువ్వేంది జైపాల్ ఉలకవు పలకవు?

 

రేపు సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ పేరిట తెలంగాణ సమాజం మొత్తం హైదరాబాద్ వీధుల్లో ఒక మహా శాంతి ప్రదర్శన చేయనుంది.

ఇదొక చారిత్రక సందర్భం.

బహుశా భారత చరిత్రలోనే ఎప్పుడూ ఆవిష్కృతం కాని అరుదైన ఘట్టం.

ఇంతటి అరుదైన సందర్భంలో, ముందు వరుసలో నిలబడి ప్రజలను తెలంగాణ వైపు నడపాల్సిన నువ్వు ముఖ్యమంత్రివి అయితే

ఆ మహా ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నంలో నీ స్వంత ప్రజలపైనే లాఠీలు, తూటాలు ప్రయోగించాల్సి వస్తుంది.

 

నీకంటే చాలా జూనియర్ అయినా సహచర కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆ మంధ్య అక్షర లక్షలు చేసే మాటొకటి అన్నాడు.

“రేపు రాయబోయే తెలంగాణ చరిత్ర పుస్తకంలో ఒక ద్రోహిగా ఉండదలుచుకోలేదు నేను”

ఒకసారి అలోచించు జైపాల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *