mt_logo

లక్ష ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళు పంపిణీకి సిద్ధం

రాష్ట్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం, నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అలాగే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వాళ్లకు ఆర్థికసాయం చేసే విషయంపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. వీటితోపాటు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ వేలంపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంపై సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు జారీ చేసినట్టుగా తెలిసింది.

లక్ష ఇళ్ళు పంపిణీకి సిద్ధం :

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో లక్ష ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల పూర్తయిన ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించారు. మరికొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడ లబ్ధిదారుల ఎంపిక జరగక, కేటాయింపులు నిలిచిపోయి ఖాళీగా ఉన్నాయి.

సమస్యల పరిష్కారానికి కృషి :

ప్రభుత్వం డబుల్ బెడ్‌రూంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించి, ఇళ్ల ప్రస్తుత పరిస్థితి, వాటి పునర్నిర్మాణ పనులు, ఇప్పటికే నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానంపై దృష్టిసారించారు. నిర్మాణం పూర్తయిన చోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, వాళ్లకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు తెలియజేశారు. నిర్మాణపరంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయ కల్పన, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల ఏర్పాటు లాంటి మౌలిక వసతుల గురించి చర్చించి, వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

లబ్ధిదారులకు కేటాయిస్తే కేంద్రం నుంచి 1100 కోట్లు :

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే కేంద్రం నుంచి 1100 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆ వచ్చే మొత్తంతో మిగతా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయవచ్చని అధికారుల ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కొత్త ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభంపై కూడా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. అయితే ఇందుకు అవసరమయ్యే మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ విషయమై ప్రభుత్వం మరోసారి విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక కసరత్తు ఓ కొలిక్కి వస్తే అధికారులు ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందచేస్తారు. ఆయన సూచనలతో పథకం అమలుకు తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాకు రూ. 5 వేల కోట్లు
ఇక సొంత జాగల్లో ఇళ్లు నిర్మించుకునే వాళ్లకు ఆర్థికసాయం అందించే కార్యక్రమంపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఖాళీగా ఉన్న, నిర్మాణం ఆగిపోయిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా ఖజానాకు 5 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *