mt_logo

కోటిన్నర ఎకరాలకు రైతుబంధు జమ చేశాం : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులను అప్పులపాలు కాకుండా కాపాడటం కోసం చేపట్టిన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎనిమిదవ విడతలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందజేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు సంబంధించి 7411.52 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. వీటిలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4.69696 మంది రైతులకు 601.7412080 కోట్ల నిధులు విడుదల చేయగా, సంగారెడ్డి జిల్లాలో 3.18988 లక్షల మంది రైతులకు 370.7452397 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 2.77920 లక్షల మంది రైతులకు 367.35397 కోట్లు, ఖమ్మంలో 3.08047 లక్షల మంది రైతులకు 356.1283145 కోట్లు, రంగారెడ్డి 2.94972 లక్షల మంది రైతులకు 345.33080 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 2.94362 మంది రైతులకు 310.6593586 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2.61079 మంది రైతులకు 309.2813804 కోట్ల నిధులు, వనపర్తి జిల్లాలో 1.58994 మంది రైతులకు 180.4064102 కోట్ల నిధులు జమ చేయగా… అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు 33.65 కోట్లు జమచేశారని వివరించారు.

రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచిలా నిలిచారన్న మంత్రి నిరంజన్ రెడ్డి…
రైతుభీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంబించి, ఉపాధిహామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. దీని వలన వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీరుతుందని అన్నారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని, పండించిన పంటలన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని, స్వామినాధన్ కమిటీ సిఫారసులను యధావిధిగా అమలు చేయాలని సూచించారు. కేవలం పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. 60 శాతం మంది జనాభా ఆధారపడిన వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానం మారితేనే రైతులు సంతోషంగా ఉంటారని, వారు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందిని తెలియజేశారు. తెలంగాణ రాకముందు పాలకులంతా రైతులను ఓటు బ్యాంకులుగానే చూశారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నం పెట్టే అన్నదాతల కష్టాలను గుర్తించి చేయూతనందించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, నిర్ణయాలతో రైతుల పట్ల, వ్యవసాయరంగం పట్ల ఆయా రాష్ట్రాల దృక్పధం మారుతూ వస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *