mt_logo

పర్యాటక కేంద్రంగా పాతనగరం : మంత్రి కేటీఆర్

“రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్నిరంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, ఇందుకనుగుణంగానే పాతనగరం అభివృద్ధి జరుగుతోంది” అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం శాసనమండలిలో మైనార్టీ సంక్షేమం, పాతనగర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాతనగరం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేండ్లలో పాత నగరం అభివృద్ధికి రూ.3934 కోట్లు ఖర్చు చేస్తే..టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏడేండ్లలో రూ.14,887 కోట్లు ఖర్చు చేసింది. అంటే దాదాపు నాలుగురెట్లు ఎక్కువ ఖర్చు చేసింది మా ప్రభుత్వం. గతంలో పాత నగరంలో రోడ్ల అభివృద్ధికి స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు లేవు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏడు ప్రాజెక్టులను తీసుకొని రూ.1,545 కోట్లతో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో రూ.452 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగిలినవి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటాం” అని అన్నారు.

“ఎస్‌ఆర్‌డీపీ ఒక్కటే కాకుండా రహదారుల నిర్వహణ కోసం నగరంలోని 729 కిలోమీటర్ల ప్రధాన మార్గాలను కాంప్రిహెన్సివ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (సీఆర్‌ఎంపీ) కింద రూ.1839 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో పాతనగరంలో 154 కిలోమీటర్ల రోడ్లు తీసుకుంటే, ఇందుకు 113 కిలోమీటర్ల రోడ్లకు ఫుట్‌పాత్‌ల విస్తరణ, ఇతర పనుల కోసం రూ.118 కోట్లు ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థను ఏర్పాటు చేసి పాతనగరంలోని 68.52 కి.మీ. రోడ్లను రూ.60 కోట్లతో మరమ్మతులు చేపట్టినం. పాతనగరంలో జరిగిన నాలా అభివృద్ధి పనులకు అనేక ప్రశంసలు వచ్చాయని” తెలిపారు.

“ఏడేండ్లలో మంచినీటి పథకాల మీద రూ.1,082 కోట్లు ఖర్చు చేసి, 90-95 శాతం నీటి సమస్యను పరిష్కరించాం. సుంకిశాలలో రూ.1,450 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. దాంట్లో నుంచి పాతబస్తీకి నీటి వాటా ఉంటుంది. నీటిసరఫరా బలోపేతానికి మరో రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. నూతనంగా ఏర్పాటు చేయబోయే 31 ఎస్టీపీలకు 14 పాతనగరంలోనే ఏర్పాటు చేస్తాం. కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాలకు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం రూ.297 కోట్లు మంజూరు చేశాం. చాంద్రాయణగుట్ట మాస్టర్‌ప్లాన్‌ పూర్తిచేసి నిధులు మంజూరుకు ప్రయత్నిస్తాం. 716 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉండగా, మరో 500 ఆటోలు ఈ నెలాఖరు వరకు వస్తాయి” అని మంత్రి అన్నారు.

“చార్మినార్‌, మక్కామసీద్‌, హైకోర్టు, సాలార్‌జంగ్‌ మ్యూజియం వంటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. అదనపు ఖర్చు అయినా సరే..చార్మినార్‌ సుందరీకరణకు చర్యలు తీసుకుంటాం. చార్మినార్‌ను మరింత అందంగా తీర్చి దిద్దితే ప్రపంచ టూరిస్టులను ఆకర్షించవచ్చు. లాడ్‌బజార్‌, పత్తర్‌ఘట్టీ, సర్దార్‌ మహల్‌ను అభివృద్ధి చేసి టూరిజం స్పాట్‌గా మార్చేందుకు మరో రూ.100-150 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చార్మినార్‌, మక్కామసీదు, మదీనా, చౌమహల్లా వంటి వారసత్వ, పర్యాటక ప్రాంతాలు 24 గంటలు శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శానిటేషన్‌ ప్రణాళిక చేపట్టడంతో గొప్ప మార్పు కనిపించింది. రూ.17 కోట్లతో మొజంజాహీ మార్కెట్‌ను టారిస్ట్‌ ఎట్రాక్షన్‌గా మార్చాం. రామప్ప గుడి తరహాలో సెవెన్‌టూంబ్స్‌, గోల్కొండను కలుపుతూ వరల్డ్‌ హెరిటేజ్‌ హోదా తెచ్చేందుకు కృషిచేస్తాం. మొత్తం హైదరాబాద్‌కు వరల్డ్‌ హెరిటేజ్‌ హోదా దొరికితే పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. 200 ఏండ్లనాటి మీరాలం ట్యాంక్‌ను దుర్గం చెరువు మాదిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రూ.40 కోట్ల పైచిలుకు ఖర్చుతో పనులు చేపట్టే ప్రతిపాదన ఉందని” తెలిపారు.

“‘పాతనగరంలో 6 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు నిర్మిస్తుండగా, ఇందులో 3 దాదాపు పూర్తయ్యాయి. ఆర్‌అండ్‌బీ ఆధ్వరంలో హైవేల కోసం రూ.33.56 కోట్ల పనులు జరుగుతున్నాయి. రూ.50 కోట్లతో బండ్లగూడ, కాటేదాన్‌, కిల్వత్‌, శాస్త్రీపురం దగ్గర స్టేడియాలు నిర్మిస్తున్నాం. పాతబస్తీలో 38,499 మంది వీధి విక్రయదారులను గుర్తించి, 38,170 మందికి కార్డులు ఇచ్చి రూ.10వేల చొప్పున లోన్‌ మంజూరు చేశాం.
నగరంలో 150 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఉంటే పాతనగరంలో 48 ఉన్నాయి. పాతనగరంలో 15,897 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తుండగా, ఇందులో 4,477 ఇండ్లు పూర్తయ్యాయి. నగరానికి దక్షిణాన మూసీనదిపై పాతనగర వైభవాన్ని చాటిచెప్పేలా 14 వంతెనలను నిర్మించబోతున్నాం. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జితో ఆ ప్రాంతానికి ఎలాగైతే కొత్త అందం వచ్చిందో అదే పద్ధతిలో మూసీపై కొత్త అందాలు తెచ్చేలా వంతెనలను నిర్మిస్తాం. ఇప్పటికే డిజైన్ల కోసం ప్రతిపాదనలు తీసుకున్నాం. అంతర్జాతీయ డిజైన్లకు టెండర్లు పిలుస్తామని” కేటీఆర్ అన్నారు. చారిత్రక ఉస్మానియా దవాఖానకు మంచి భవనం నిర్మించడంతోపాటు, చక్కటి వైద్య అందించే విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఏడేళ్లలో పాతనగరంలో 8 ప్రసూతి, మూడు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 50 పట్టణ ప్రాథమిక కేంద్రాలను బలోపేతం చేశాం. కొత్తగా 84 బస్తీ దవాఖానలను ఓల్ట్‌సిటీలో ఏర్పాటు చేశాం. నగరం మొత్తం 350 బస్తీ దవాఖానాలు పెట్టాలని లక్ష్యం కాగా, 109 ఓల్డ్‌సిటీలో ఏర్పాటు చేశాం. అలాగే ఉస్మానియా, నిలోఫర్‌, మహవీర్‌, నాంపల్లి ఏరియా దవాఖానల్లో రూ.13 కోట్లతో నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేశామని” మంత్రి కేటీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *