mt_logo

ఒకే ఒక్కడు!

By: సవాల్ రెడ్డి


రాష్ట్ర సాధనలో కేసీఆర్ అపూర్వ ప్రయాణం
ఆటుపోట్లకు కుంగని ధీరత్వం
రాజకీయ చతురత, ఎత్తుగడలతో సాగిన ప్రస్థానం
ప్రతిగుండె జై తెలంగాణ అనిపించేలా కృషివలుడు
ఇంతింతై… అన్నట్లుగా ఎదిగిన వృక్షం టీఆర్‌ఎస్

‘‘ఆరంభించరు నీచ మానవులు..’’ అంటూ భర్తృహరి సుభాషితాన్ని కేసీఆర్ పదేపదే వివిధ సభల్లో చెబుతారు. చేపట్టిన పనిని పూర్తి చేసేదాకా విశ్రమించని వాడే ధీరోదాత్తుడని ఆ పద్యం అర్థం. తెలంగాణకోసం ఆయన చేసిన రాజీలేని పోరాటాన్ని చూస్తే దాన్ని కేసీఆర్ దాన్ని ఎంత ఆవాహన చేసుకున్నారో అర్థమవుతుంది. ఆయన భాషలోనే చెప్పాలంటే.. ‘అన్నమే తిన్నడో అటుకులో తిన్నడో..’’ ఉద్యమం మాత్రం వదలలేదు. కొసదాకా కొట్లాడిన సిపాయిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మనది ధర్మపోరాటం అంటూ పదేపదే ప్రవచించిన విధంగానే పుష్కరకాల పోరాటం ఆసాంతం ధర్మం తప్పకుండా నడిపించారు. నిలువెత్తు ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మించుకున్న తెలంగాణ భవన్‌లో లక్షల మందితో కొలువు తీరినా…ఒంటరిగా మిగిలిపోయినా బాట తప్పలేదు. మాట మార్చలేదు. 2009 యుద్ధంలో అన్నీ కోల్పోయి ఇక అయిపోయింది అన్న సమయంలోనూ విలేకరుల సమావేశం పెట్టి ‘‘ …. అండ్ ద ఫైట్ విల్ కంటిన్యూ’’ అనగలిగిన ధీరోదాత్తత, సానుకూల దృక్పథం ఒక్క కేసీఆర్‌కే చెల్లు!!

మలిదశ తెలంగాణ ఉద్యమం ఆసాంతం కేసీఆర్‌దే. ప్రతి మలుపులోనూ ఆయనే. గెలుపులోనూ ఆయనే. 13 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమ దీపం ఆరకుండా ఆయన వేసిన ఎత్తుగడలు, ఆ క్రమంలో జరిపిన పోరాటాలు ఉద్యమాలకు ఒక కొత్త సిలబస్. జలదృశ్యంలో గుప్పెడుమందితో పురుడుపోసుకున్న ఉద్యమం జనసాగర కెరటమై ఢిల్లీని ముంచెత్తడం ఒక అపూర్వ సంఘటన. గ్లోబల్‌యుగంలో ఓ బక్కపలుచని మనిషి దేశాన్ని అరచేత శాసించే పారిశ్రామిక, రాజకీయ, మీడియా శక్తులను ఢీ కొట్టి తుత్తునియలు చేయడం అపూర్వం. శత్రువుకు చిక్కకుండా ఉద్యమ రథాన్ని వడివడిగా గమ్యంవైపు పరుగులెత్తించిన ఆ ప్రస్తానంలో ఎన్నో మలుపులు మరపురాని ఘట్టాలు. తొలిఘట్టం జలదృశ్యం.. పదవులకోసం తెలంగాణ అనే అపవాదును బద్దలు కొడుతూ ఆ వేదికపైనుంచి మూడు రాజీనామాలు.. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ క్రియాశీల సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి ఏప్రిల్ 27, 2001న రాజీనామాలిచ్చి ప్రజల తీర్పుకు సిద్ధమయ్యారు. పదవీ త్యాగంతో ఉద్యమానికి పురుడు పోశారు. ఉద్యమాలంటే విధ్వంసాలన్న అపప్రథను తొలగిస్తూ అహింసా మార్గం ఉద్యమ మార్గంగా ప్రకటించారు. రాజకీయ ప్రక్రియలో తెలంగాణ సాధన నినాదంగా తీసుకున్నారు. 69 విద్రోహ ముద్ర చెరుపుకుంటూ మార్గం వదిలితే రాళ్లతో కొట్టమని బహిరంగ శపథం తీసుకుని విశ్వాసం ప్రోది చేశారు. తక్షణ కార్యాచరణ కింద కరీంనగర్ సింహ గర్జన ప్రకటించారు. హేళనగా చూసిన ప్రతీపశక్తుల గుండెలు గుభిల్లుమనేలా కరీంనగర్ గర్జనకు లక్షల మంది చీమలాబారులా తరలివచ్చారు. ఆశీస్సు కోసం శిబూసొరేన్‌ను పిలిచారు. ఆయన రాష్ట్రం సాధించిన మార్గాన్ని ఆ వేదికపైనే వివరించారు. సభ అంటే జనం తరలింపు మాత్రమే కాదు వారి విశ్వాసాన్ని చూరగొనే ఆయుధంగా మలుచుకున్నారు.

ఉద్యమం ఆసిధారావ్రతం. తొలి అగ్ని పరీక్ష వచ్చింది. సిద్దిపేట ఉప ఎన్నిక. గొంతు విప్పిన ఉద్యమం నోరు మూయించేందుకు డబ్బు సంచులు దిగాయి.మంత్రులు దిగారు. మంత్రాంగాలు జరిగాయి. చక్రం తిప్పేనేతలు ఎత్తుల మీద ఎత్తులు వేశారు. ప్రజాబలం అండగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 22న భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ బాడ్జి పెట్టుకుని సగర్వంగా శాసనసభా ప్రవేశం చేశారు. ఇక విశ్రమించలేదు. ఆ తర్వాతే తరుముకొచ్చిన స్థానిక ఎన్నికలు. పరీక్షే.. పార్టీ నిర్మాణమే లేదు. ధనబలం లేదు. ప్రచారం చేసే మీడియా లేదు. పది జిల్లాల నలుమూలలకు ఉద్యమ నినాదం చేరనే లేదు. అయినా వెన్ను చూపలేదు. సుడిగాలి పర్యటనలు ప్రచారాలు. తెలంగాణది పెద్ద మనసు. ఉద్యమం మీద మనసు పడింది. బ్యాలెట్ పెట్టెల్లో ఓటూ పడింది.టీఆర్‌ఎస్ ఎత్తుగడ ఫలించింది. పెద్ద పెద్ద పార్టీలకు దిమ్మతిరిగింది. పుట్టి పదినెలలు దాటలేదు. ముక్కుపచ్చలారలేదు. ఇరవై శాతం ఓటింగ్ శాతం అధిగమించింది. రెండు జడ్పీలు దక్కించుకుంది. పెద్ద పెద్ద వాళ్లకు చెమటలు పట్టాయి. అల్లంత దూరంలోని అసెంబ్లీ ఎన్నికలు తలుచుకుని నిద్రలు కరువయ్యాయి. కొంతకాలం విరామం. మీడియా సొల్లు ప్రారంభం. చల్లారింది అన్నది. అడ్రస్ ఎక్కడ అన్నాడు చంద్రబాబు. పరీక్షకు నిలబడడమే ధీరత్వం. పరేడ్ గ్రౌండ్ సమాధానం చెప్పింది. ఇసకేస్తే రాలని జనం తరలివచ్చి టీఆర్‌ఎస్ అడ్రస్ ఏదో పాలకులకు చెప్పారు. సంఘీభావంగా వచ్చిన జాతీయ నాయకులు చెప్పారు. తెలంగాణ అంశం జాతీయ ఎజెండాకు ఎక్కింది. ఆ వెనుకే వెయ్యికి పైగా కార్లతో ఢిల్లీ యాత్ర. ఉత్తర భారతం నోరు వెల్లబట్టింది.

రాజకీయ ప్రక్రియకు యుద్ధ వేదిక ఎన్నికలే. 2004 ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ప్రతిపక్ష పార్టీకి సంకటం వచ్చింది. రాజకీయ అనివార్యత అన్న సూత్రం ప్రభావవంతంగా పనిచేసింది. దేశాన్ని అనేక ఏళ్లు ఏలిన పార్టీ తెలంగాణకు అనుకూల తీర్మానం చేసింది. కేసీఆర్ ఇంటికి వచ్చి పొత్తు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం సగర్వంగా 26 స్థానాలతో శాసనసభకు చేరింది. ఐదు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. యూపీఎ-1 కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో స్థానం దక్కించుకుంది. ఆ తరువాత కేంద్ర క్యాబినెట్‌లో కేసీఆర్ నెలలు పోర్ట్‌పోలియో లేని మంత్రిగా కొనసాగారు. లక్ష్యం తెలంగాణ మాత్రమేనని, పోర్ట్‌పోలియో అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆ తరువాత రాష్ట్రపతి ప్రసంగంలో, ప్రధాన మంత్రి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తానాల వెంట పతనాలూ ఉంటాయి. యూపీఎ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తేల్చక పోవడంతో రాష్ట్రంలోని మంత్రిపదవులకు, కేంద్ర మంత్రి పదవులకు టీఆర్‌ఎస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చింది. కేసీఆర్ దెబ్బతిన్న బెబ్బులిలా కరీంనగర్ స్థానానికి రాజీనామా చేశారు. బంగారం లాంటి అవకాశమనుకున్నారు సీమాంధ్ర నాయకులు, మీడియా. కనివని ఎరుగని దాడి. కోట్ల రూపాయలు కురిపించారు. లారీలకు లారీలు క్రికెట్ కిట్లు పంచారు. తమ కోసం అగ్ని పరీక్షకు సిద్ధమైన కేసీఆర్‌కు తెలంగాణ యావత్తూ అండగా నిలిచింది. అధికార మదాంధుల కళ్లు మిరమిట్లు గొలిపేలా లక్షల మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు. ఆరిపోతుందనుకున్న ఉద్యమ దీపం దేదీప్యమానమైంది. మళ్లీ ఎన్నికలు వచ్చేలోపు తిరిగి రాజకీయ అనివార్యత సృష్టి లక్ష్యంగా మొత్తం టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఎన్నికలకు నిలబడ్డారు. గెలిచి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 7 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. టీఆర్‌ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పంచన చేరారు.

ఆ తరువాత వచ్చిన రాజకీయపరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు.. ఉద్యమ పంచవర్ష ప్రణాళికకు మెరుగులు దిద్దాల్సిన సమయం. 2009 ఎన్నికలు టీఆర్‌ఎస్ చెప్పిన రాజకీయ అనివార్యతకు పరాకాష్ట. సమైక్యమే విధానమన్న తెలుగుదేశం దానికి చెల్లుచీటి ఇచ్చి తెలంగాణ తీర్మానం చేసి పొత్తుకోసం మోకరిల్లింది. కాంగ్రెస్‌తో తెలంగాణ అనిపించినం కాబట్టి టీడీపీతోనూ అనిపిస్తే విస్తృత అంగీకారం దొరుకుతుందన్న ఎత్తుగడతో టీడీపీ పొత్తుకు కేసీఆర్ ముద్ర వేశారు. అయితే తెలంగాణ ప్రజలకు ఈ పొత్తు రుచించలేదు. ఫలితం 45 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రమే దక్కాయి. ఉథ్తాన సమయంలో ఆకాశానికెత్తిన వాళ్లు ఓటమి వేళ రాళ్లు వేశారు. కుడి ఎడమ భుజాలనుకున్న వాళ్లూ నిందలు వేసి వెళ్లి పోయారు. ఒంటరిగా తెలంగాణ భవన్‌లో.. మార్గం మూసుకుపోయిన పరిస్థితి. పద్మవ్యూహంలో చిత్తు అయిన అభిమన్యుడి స్థితి. కానీ కేసీఆర్ అభిమన్యుడు కాదు. ఆశావాది. ఇంకా పోరాటం మిగిలే ఉంది అని ప్రకటించారు. మూడు నెలల నిశబ్దం.

వైఎస్ మరణం.. 14 ఎఫ్ సాకుతో హైదరాబాద్ ఉద్యోగాలు కూడా కాజేసే కుట్ర. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే చావుదెబ్బ కొట్టాలి. కేసీఆర్ దెబ్బతిన్న బెబ్బులిలా పంజా విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరణ నిరాహార దీక్షకు ప్రకటించారు. నిశ్చలంగా ఉన్న రాజకీయం కకావికలమైంది. నవంబర్ 29, 2009 కేసీఆర్ సిద్దిపేటలో దీక్షకు కూర్చునేందుకు కరీంనగర్ నుండి బయలు దేరారు. బయలుదేరకుండా కేసీఆర్‌ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నించారు. కరీంనగర్‌లోనే అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అక్కడి నుండి తెలంగాణ ఉద్యమం దావానలమై అంటుకుంది. కేసీఆర్‌కు 14 రోజుల రిమాండ్ విధించగానే తెలంగాణ సమాజం ఆగ్గిమీద గుగ్గిలం అయింది. మొత్తం ప్రజాజీవనం స్తంభించిపోయింది. కేసీఆర్ జైల్లోనే అమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తుండటంతో పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. ఈ సమయంలోనే తెలంగాణ మొత్తం బంద్‌కు పిలుపునిచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఇక్కడి పరిస్థితిని పార్టీ హైకమాండ్‌కు వివరించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీ ఉదయానికి పరిస్థితి దిగజారుతోందనే సమాచారం బయటకు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. మూడునాలుగు సార్లు కోర్‌కమిటీ భేటీ నిర్వహించి టీఆర్‌ఎస్ ముఖ్యులతో, ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చలు జరిపారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. కేసీఆర్ అనుకున్న ఫలితం సాధించారు.

అయితే సీమాంధ్రలో సమైక్య కృత్రిమ ఉద్యమంతో అది విఫలమైంది. కేసీఆర్ కొత్త ఎత్తుగడ సకల జనులందరినీ ఉద్యమంలోకి దింపితే తప్ప కల సాకారం కాదు. జానారెడ్డితో మంతనాలు చేసి జేఏసీని సృష్టించారు. ఇక రాజకీయం ఉద్యమం చెట్టపట్టాలేసుకుని ఉద్యమాలను ఉరకలెత్తించాయి. ఆ తరువాత శ్రీకృష్ణ కమిటీ ప్రహసనం. ఏడాది కాల హరణం. ధర్మమార్గం తప్పరాదన్న నియమం పాటించి సంయమనం పాటించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేల రాజీనామాలకు జేఏసీ పిలుపు నిచ్చింది. టీఆర్‌ఎస్ ఒక్కటే వధ్యశిల ఎక్కడానికి సిద్ధపడింది. మళ్లీ ఎన్నికలు. ఎవరెవరికో ఆశలు పుట్టాయి. పెద్ద మనిషిని అవుతానని ఉబలాట పడే వారు బయల్దేరారు. త్యాగానికి తెలంగాణ జై కొట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లక్షల మెజారిటీ. మాట తప్పిన ద్రోహులకు డిపాజిట్ల గల్లంతు. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే బరి గీసి తెలంగాణ ఒక్కదిక్కు నిలబడింది. సీమాంధ్రపార్టీలను వెలివేసింది. కేంద్రానికి అందాల్సిన సందేశం అందింది. ఒక అనివార్యత వచ్చేసింది. ఆ తరువాత కేంద్ర హోంశాఖ అఖిలపక్షం పెట్టి మరోసారి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. ఇంకోవైపు జేఏసీ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు… రాజీవ్ రహదారి దిగ్బంధాలు.. రోడ్డు మీద సహపంక్తి భోజనాలు.. మిలియన్ మార్చ్‌లు..సాగర హారాలు.. అసెంబ్లీ దిగ్బంధాలు. ఆఖరికి సకల జనుల సమ్మె… దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. ఢిల్లీకి తిరుగులేని హెచ్చరిక అందింది. పర్యవసానంగా 2013 జూలై 30 వ తేదీ సీడబ్ల్యూసీ తీర్మానం తదనంతర పరిణామాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *