mt_logo

నవంబర్ 29, 2009…..ఆ రోజు ఏం జరిగిందంటే…

By: కెప్టెన్ లక్ష్మీకాంతరావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

కరీంనగర్ నుంచి అల్గనూర్ దాకా ఒక భయంకరమైన వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి మేం దాదాపు వందకుపైగా వాహనాల కాన్వాయితో బయలుదేరినం. కేసీఆర్, జయశంకర్, నేనూ, నాయిని నర్సింహారెడ్డి, రాజయ్యయాదవ్, విజయరామారావు అందరం ఒకే వాహనంలో బయలుదేరాం. మా భారీ కాన్వాయిని పోలీసులు తప్పించారు. ఒక్క మా వెహికిలే..మాకు ఇటుపక్క అటుపక్క మొత్తం పోలీసోళ్ల వెహికిల్సే. మెల్లమెల్లగా కాన్వాయిని తప్పించిండ్లు.

అసలా కాన్వాయే కనిపించకుండా చేసిండ్లు. అల్గనూర్ దగ్గరికి వచ్చేసరికి యుద్ధవాతావరణాన్ని సృష్టించారు పోలీసోళ్లు. ఒక పెద్ద పోలీస్ అధికారి కేసీఆర్ దగ్గరికి వచ్చి ‘సర్ మిమ్ములను అరెస్టు చేస్తున్నం’ అని అనంగనే ఆయనకు బాగా కోపం చేసిండు. ‘నన్ను అరెస్టు చేసేందుకు నీ దగ్గర ఏమన్నా కాయితం ఉందా..నేను అరెస్టు కాను’ అని బండిదిగనని చెప్పిండు. బలవంతంగా ఆయన్ను దించడంతోనే ఆయన అక్కడే నేలమీద కూసున్నడు. నిరసన తెలుపుతనే ఉన్నడు. అరే సార్ దిగిండు మనం కుడ దిగుతం అని దిగినం. క్షణాల్లో పోలీసులు మమ్మలందరిని పట్టుకున్నరు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు అక్కడి నుంచి స్టార్టయినవి. అక్కడి నుంచి ఏం చెప్పకుండా ఎక్కడ ఆపకుంట ఖమ్మం తీస్కపోయిండ్లు.

ఖమ్మంలో ఒక ఎక్సైజ్ కేసులు చూసే ఒక రిటైర్డ్ జడ్జి ముందర పెట్టిండ్లు. అరే ఇదేంది అని ఆశ్చర్యపోయిండ్లు. అప్పటికీ కేసు లేదు ఏం లేదు. మూడు గంటలు అక్కడ వేయిట్ చేయించి కేసు బుక్‌చేసిండ్లు. అయితే కేసీఆర్ అన్నరు ‘మమ్ములను ఖమ్మం జైల్లో పెట్టొద్దు. అదొక జిల్లా జైలు. మమ్మల్ని ఉం చాలంటే సెంట్రల్ జైలుకు తరలించాల’న్నడు. అయితే అక్కడ పరిస్థితిని అనుమానంగా చూసిన జడ్జికి పోలీసులు రాసిచ్చిండ్లు ‘మేం రేప్పొద్దున హైదరబాద్‌కు షిఫ్ట్ చేస్తం అన్నరు. అంటే ఆయన రిమాండ్ రాసిండు. అప్పటికే కేసీఆర్ దీక్ష కొనసాగిస్తున్నడు. తెల్లారి ఓ పోలీసాఫీసర్ వచ్చిండు. ఎందుకచ్చిండ్లు అని అడిగితే ఊర్కనే చూసి పోతమని వచ్చినం అన్నడు. అంతా చూసుకొని పోయిండ్లు. తరువాత చానా మంది పోలీసులతో వచ్చిండు. వస్తూవస్తూ ఓ చిలుము పట్టిన స్ట్రెచర్ తీస్కచ్చిండు. అప్పటికే డాక్టర్ సాబ్ (జీవీఆర్) కేసీఆర్ పల్స్ చూస్తాండు. అప్పుడే పోలీసులు మా బ్యారెక్‌లోకి వచ్చిండ్లు. గమనించి నాయిని నర్సింహారెడ్డి మిగితావాళ్లం అంతా గొడవచేసినం. ఒక సిమెంట్ బస్తను ఇద్దరు పట్టుకొని ఇసిరేసినట్టు కేసీఆర్‌ను ఇద్దరుపట్టుకొని ఆ స్ట్రెచర్ మీద విసిరేండ్లు. మేం గొడవ పడుతున్నం. నాయిని నెట్టేస్తే ఆయన కాలికి దెబ్బతగిలింది. డాక్టర్‌సాబ్‌ను గోడకు నెట్టేస్తే ఆయనకు దెబ్బతాకింది, రాజయ్యయాదవ్‌ను ఓ దిక్కు నెట్టేసిండ్లు. నేను బ్యారెక్ గేట్ దగ్గర కొద్దిసేపు ప్రతిఘటించిన. అయినా అందరినీ నెట్టేసి దుర్మార్గంగా బ్యారెక్‌కు తాళం వేసి కేసీఆర్‌ను తీస్కపోయిండ్లు.

తెలంగాణ ఉద్యమానికి నాయకుడినే ఇట్ల చేస్తే రేపు మన గతేంది అని అనుకున్నం. అసలు కేసీఆర్‌ను వీళ్లేం చేస్తరు. కొంపదీసి ఎన్‌కౌంటర్ చేస్తరా? ఏంది? బయట ఏం జరుగుతుందో మాకు అర్థం కావడంలేదు? ఆయనను ఏం చేస్తరు? గింత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నరు ఏందిది అని మా మనసులు ఒక్కసారిగా బాధించినయి. నిజానికి చెప్పడానికి నోరురావడం లేదు కానీ అప్పుడు దుఃఖం తప్ప ఏం చేయలేకపోయినం. అటువంటి పరిస్థితి అది. అక్కడి నుంచి కేసీఆర్‌ను హాస్పటిల్‌కు తీస్కపోయిండ్లని, అ క్కడ ఆయన మమ్ములను కూడా పిలవాలని గట్టిగ చెప్పడంతో జైలర్ వచ్చి ‘కేసీఆర్ హాస్పిటల్ లో ఉన్నడు మిమ్ములను కూడా అక్కడికే రమ్మంటున్నారు’ అని చెప్పేసరికి భయం వేసింది. ఈ పోలీసులు ఆయన కాళ్లుక్కలు ఇరుగ్గొట్టి హాస్పటల్‌లో వేశారా? పోలీసుల తీరు చూస్తే అదే అ నుమానం. అయితే మేం జైలు నుంచి బయటకి రావడానికి అక్కడ దరిదాపు అర్ధగంట తతంగం నడిచింది. కనీ కేసీఆర్‌కు ఇవేమీ చేసినట్టు జైలు రికార్డుల్లో లేవు. మేం జైలర్‌ను అడిగాం. వాళ్లు నీళ్లు నమిలారు.

జైలు వాళ్లు ఆగమాగం అయితాండ్లు. దాన్ని చూసి మా అనుమానానికి మరింత బలం వస్తాంది. మల్లా మేం హాస్పటల్‌కు పోయేసరికి బయటంతా యుద్ధవాతావరణమే. పోలీసులు తెలంగాణ వాదులు, హరీశ్‌రావు, కేటీఆర్ వీళ్లతోపాటు జయశంకర్ సర్ అందరూ ఉన్నా రు. ఎవ్వరి ముఖాలు చూసినా ఆందోళనే కన్పిస్తుంది. మాకు మరింత భయం పెరిగింది. అల్గనూర్ నుంచి ఖమ్మం దాకా మమ్మల్ని అరెస్టుచేశామన్న విషయం తెలుసుకొని ఊరూరా జనం క్షణాల్లో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలను మేం కళ్లారా చూసినం. ఎక్కడిక్కడ పోలీసులు తెలంగాణవాదుల్ని అదుపులోకి తీసుకోవడం లాఠీచార్జీలు చేయడం చూస్తూ వచ్చినం. ఇక్కడ సీన్ అంతా ఇట్లా ఉంది. జరగరానిది ఏదన్నా జరిగిందా అన్న అనుమానం వచ్చింది. అప్పటికే కేసీఆర్ దీక్ష విరమించాడని, ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించే ఆలోచనే ఆయనకు లేదని మాకు తెలుసు. కనీ పోలీసులే ఏదో చేసి ఉంటారని అనుకున్నాం.

కేసీఆర్‌చేత బలవంతంగా దీక్ష విరమింపజేసినట్టుగా ఏవో తాగిచ్చారని అదీ ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందన్నారు. బయట మొత్తం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పిల్లలు కేసీఆర్ దీక్ష విరమించాలని లేదంటే మేం పెట్రోల్ పోసుకొని చనిపోతామని నాలుగైదు వందలమంది ఆందోళన చేస్తున్నారంటూ రకాల అబద్ధాలను కేసీఆర్‌కు ఒకవైపు చెప్తూ మరోవైపు ఆయనకు ఏదోమత్తు ఇచ్చి పోలీసులు ఆయన చేత గ్లాస్‌పట్టిచ్చి పోలీసులే ఫొటో తీయించి ప్రెస్‌కిచ్చి ఉద్యమా న్ని మలినం చేశారు. ఆయనకు అసలు విషయం తెలిసి చాలా సీరియస్ అయ్యారు. ఆయన దీక్ష కొనసాగిస్తున్నారని, పోలీసులు దుర్మార్గంగా దీక్ష విరమింపజేసినట్టు జయశంకర్ సార్ చెప్పిండు. లేదులేదు నేనే అసలు విషయం చెప్తానని కేసీఆర్ అల్లకల్లోలం చేశారు. అంతకుముందే స్టేట్ హ్యూమన్‌రైట్స్‌ను ఆశ్రయిస్తే కలెక్టరే హాస్పటల్‌కు రావడంతో పరిస్థితి మారింది. ఒకనాడు సైన్యంలో అదీ 1965 పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్న దేశభక్తుడిగా భారత ప్రభుత్వం సేవామెడల్ ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే జైల్లో వేసింది. ఇది మరచిపోలేని అనుభవం.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *