సీఎం ఇచ్చిన నోటీస్, తీర్మానం తెలంగాణ బిల్లుకు వర్తించవని, తీర్మానం బిల్లులో భాగమే కాదని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారంతో అసెంబ్లీలో సభ్యులు అభిప్రాయాలు చెప్పడం పూర్తయిందని, దీంతో చర్చ ముగిసి బిల్లును త్వరలో రాష్ట్రపతికి పంపిస్తామని స్పష్టం చేశారు. రూల్ 77 అనేది శాసనసభకు వ్యవహరించినదని, రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి నుండి వచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసికూడా ఇలా ప్రవర్తించడం సీమాంధ్రుల అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. 77వ నిబంధన ప్రకారం చేసిన తీర్మానానికి, రాష్ట్ర విభజన బిల్లుతో సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-13 పై 86 మంది శాసనసభ్యులు 53 గంటలపాటు సభలో చర్చించి అభిప్రాయాలు తెలిపారని, రాతపూర్వకంగా కూడా స్పీకర్ కు అందచేసారని ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చ ముగిసినట్లు, త్వరలో సభ్యుల అభిప్రాయాలను, బిల్లును రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ ప్రకటించారని ఈ సందర్భంగా మల్లు క్లారిటీ ఇచ్చారు.